నిజంగా నేనలా చేస్తే...నాతో ఎందుకు సినిమాలు తీస్తారు? | Chit Chat With Varun Sandesh | Sakshi
Sakshi News home page

నిజంగా నేనలా చేస్తే...నాతో ఎందుకు సినిమాలు తీస్తారు?

Published Mon, Jul 21 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

నిజంగా నేనలా చేస్తే...నాతో ఎందుకు సినిమాలు తీస్తారు?

నిజంగా నేనలా చేస్తే...నాతో ఎందుకు సినిమాలు తీస్తారు?

 ‘‘తొలి సినిమా ‘హ్యాపీడేస్’ చేసినప్పుడు నాకు 18 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులో కెరీర్ ఆరంభించడం, జయాపజయాలు చూడటం వల్ల నేను ‘స్ట్రాంగ్ పర్సన్’ కాగలిగాను’’ అని చెప్పారు వరుణ్ సందేశ్. నేడు ఈ చాక్లెట్ బోయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వరుణ్‌తో చిట్ చాట్.
 
 హీరోగా ఈ ఏడేళ్ల ప్రయాణం మీకెలా అనిపిస్తోంది?
 ‘హ్యాపీడేస్’ వంటి సినిమాతో హీరో కావడం నా అదృష్టం. ఆ వెంటనే ‘కొత్త బంగారు లోకం’ వంటి సూపర్ హిట్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. అయితే, హీరోగా ఓ రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత ఆ సినిమాలు చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే, ఆ సినిమాలు పెద్ద విజయం సాధించడంతో నా తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగాయి. ఆ సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, భారీ అంచనాలు ఉండటంతో ప్రేక్షకులు అంతగా సంతృప్తిపడలేదు.
 
 స్టార్ డెరైక్టర్‌తో ‘హ్యాపీడేస్’ చేశారు. ‘దిల్’ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ బేనర్‌లో ‘కొత్త బంగారు లోకం’, ‘మరోచరిత్ర’ చిత్రాలు చేశారు. ఆ తర్వాత ఆ స్థాయి దర్శక, నిర్మాతలతో సినిమాలెందుకు చేయలేదు?
 అది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన అవకాశాల్లో మంచి చిత్రాలను ఎన్నుకుని చేశాను. మొహమాటం కోసం కొన్ని సినిమాలు చేశాను. అసలు చెక్ తీసుకోకుండా చేసిన సినిమాలూ ఉన్నాయి. బాగున్న కొన్ని సినిమాలు సరైన ప్రచారం లేక ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే, ఈ మధ్యకాలంలో నా కెరీర్‌లో అపజయాల శాతమే ఎక్కువ.
 
 ఇకనుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు?

 కొంచెం మొహమాటం తగ్గించుకోవాలనుకుంటున్నా. అలాగే, సినిమా ప్రమోషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నా.
 
 ప్రచార కార్యక్రమాలు సరిగ్గా చేయడం నిర్మాత బాధ్యత. కానీ, మీ సినిమాలకు సరిగ్గా ప్రచారం జరగదలేనుకుంటున్నారు కాబట్టి, భవిష్యత్తులో నిర్మాతగా మారే ఆలోచన ఉందా?
 ఆ ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. కథాబలం ఉన్న చిత్రాలు తీయడంతో పాటు, వాటిని సరైన రీతిలో ప్రమోట్ చేయాలన్నదే నా ఆశయం. ఇవాళ మీ చేతిలో ఎంత మంచి ప్రోడెక్ట్ ఉన్నా, దాని గురించి నలుగురికీ తెలియకపోతే వృథానే.
 
 మీరు పబ్బులకు వెళతారని, లేట్ నైట్ పార్టీల వల్ల షూటింగ్స్‌కి ఆలస్యంగా వెళుతుంటారనే వార్త ఉంది... నిజమా?
 పూర్తిగా అబద్ధం. అందుకు నిదర్శనం నా చేతిలో ఉన్న సినిమాలే. నా చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలుంటాయి. పైగా, అపజయాల సంఖ్య ఎక్కువే ఉన్నా, నిర్మాతలు నాతో సినిమాలు తీయడానికి సుముఖంగా ఉన్నారు. నేనెంత సిన్సియర్‌గా ఉంటానో దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నా కారణంగా షూటింగ్స్‌కి ఆటంకం కలిగితే, నాతో ఎందుకు సినిమాలు తీస్తారు? నా గురించి ఎన్ని వదంతులు వచ్చినా, వాటిని నమ్మకుండా నాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
 
 ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి?
 త్రినాథరావుగారి దర్శకత్వంలో చేసిన ‘నువ్వలా నేనిలా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నా కెరీర్‌కి చాలా ప్లస్ అవుతుంది. అలాగే, ‘లవకుశ’ అనే చిత్రం చేస్తున్నా. ఇందులో లవ, కుశ అనే రెండు పాత్రలు పోషిస్తున్నాను. ద్విపాత్రాభినయం అంత సులువు కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఇది కాకుండా ‘పడ్డానండి ప్రేమలో మరి’లో నటిస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.
 
 ఓకే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు.. లవ్‌లో ఏమైనా పడ్డారా?
 రెండేళ్ల లోపు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రేమలో పడలేదు. రెండేళ్ల లోపు పడితే ప్రేమ వివాహం. లేకపోతే.. అమ్మా, నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లాడతా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement