బాలీవుడ్ కథానాయికలందరిలోనూ భిన్నంగా కనిపిస్తారు దీపికా పదుకొనే. ఇంతటి అందాన్ని దీపిక ఎలా మెయింటైన్ చేయగలుతున్నారు? ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరి ప్రశ్న ఇది. దానికి ఇటీవలే ఈ అందాల భామ స్వయంగా సమాధానమిచ్చారు. తన నిత్య కృత్యాల గురించి, ఆహార నియమాల గురించి పూస గుచ్చినట్లు చెప్పారు. ‘‘స్టార్ హీరోయిన్లందరూ స్టార్ హోటల్ ఫుడ్‌నే ఆఫర్ చేస్తారనే దురభిప్రాయం ఉంది. కానీ అందులో నిజం లేదు.
నాకు తెలిసి తప్పని సరి పరిస్థితుల్లోనే హీరోయిన్లు స్టార్ హోటల్ భోజనం చేయాల్సి వస్తుంది. అంతే తప్ప ప్రతిసారీ అదే తినరు. అలా చేస్తే.. ఆరోగ్యం చెడిపోతుంది. బరువు పెరుగుతాం. దాంతో రోజు చేసేదానికంటే... ఇంకాస్త ఎక్కువ సేపు వర్కవుట్లు చేయాల్సొస్తుంది. పైగా వాటిలో పోషకాలు తక్కువ. నా వరకూ నేను సాధ్యమైనంత వరకూ స్టార్ హోటల్ ఫుడ్ తినను. ఇంటి నుంచే తెచ్చుకుంటాను. ఉదయం అల్పాహారంగా ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ, ఒక రోజు పరోటా, ఒక రోజు ఉప్మా తీసుకుంటాను. వారంలో ఒక రోజు మాత్రం అల్పాహారంలో మాంసాహారం తింటాను.
మధ్యాహ్న భోజనం విషయానికొస్తే.. భోజనంలో సలాడ్‌తో పాటు రెండు రొట్టెలు, పప్పు, కూర తీసుకుంటాను. సాయంత్రం 6 గంటలకే రాత్రి భోజనం ముగిస్తాను. మాంసాహారం మాత్రం రాత్రిళ్లు అస్సలు ముట్టను. ఇక తిన్నది అరగాలి కదా! అందుకే.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తాను. అందమైన శరీరాకృతి కోసం కార్డియో, లైట్ వెయిట్ ఎక్సర్‌సైజులు చేస్తాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను కాబట్టే... ఈ రోజు నా ఫిజిక్ గురించి అందరూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ విషయంలో నన్ను స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు కూడా ఉన్నారంటే నమ్ముతారా!’’ అంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు దీపిక.
దీపిక సౌందర్య రహస్యాలు
Published Sat, Jun 28 2014 11:01 PM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
Advertisement
Advertisement