అవి మేలే చేశాయి
అవి మేలే చేశాయి
Published Fri, Feb 28 2014 3:03 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
విమర్శలు, వదంతులు నాకు మేలే చేశాయంటున్నారు నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో మగధీర తరువాత క్రేజీ హీరోయిన్ల జాబితాలో చేరిన ఈ బ్యూటీ ఇటీవల కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. అదే విధంగా కోలీవుడ్‌లో విజయ్ సరసన తుపాకి, జిల్లా చిత్రాల్లో నటించినా ఆ తరువాత ఆశించిన అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు పెళ్లి కావడంలేదనే బెంగ పెట్టుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం ఈ అమ్మడు ఇటీవల శ్రీకాళహస్తికి వెళ్లి దోష నివారణకు విశేష పూజలు నిర్వహించడమే. అదేవిధంగా తనకంటే ముందు చెల్లెలి పెళ్లి జరిగిపోవడం కూడా ఈ భామ కలవరానికి కారణం అని తెలుస్తోంది. అయితే అలాంటి భయాలేమీ తనకు లేవంటున్నారు కాజల్. శ్రీ కాళహస్తికి వెళ్లడాన్ని కూడా బూతద్దంలో చూస్తున్నారని నిజానికి తన చెల్లెలి పెళ్లికి హాజరైన తన కజిన్ సిస్టర్స్ తిరుమలను దర్శించాలనే ఆకాంక్షను వెల్లడించడంతో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లామన్నారు.
శ్రీకాళహస్తికి వెళ్లి చిన్న పూజ నిర్వహించామని చెప్పారు. నిజానికి తాము అక్కడ ఒక గంట సమయం మాత్రమే గడిపామని తెలిపారు. ఏదేమయినా ఇలాంటి పస లేని ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమిళంలో తుపాకి, జిల్లా వంటి చిత్రాల్లో స్టార్ హీరోలు విజయ్, మోహన్‌లాల్‌తో కలిసి నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఈ చిత్రాల్లో తన నటనకు చాలా ప్రశంసలు అందుకున్నానన్నారు. కొన్ని సద్విమర్శల ద్వారా చాలా నేర్చుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. అలాంటి విమర్శలు తనకు మేలే చేశాయన్నారు. అయినా అంతగా అవకాశాలు రావడంలేదుగా అన్న ప్రశ్నకు తానేమీ ఖాళీగా కూర్చోలేదని హిందీలో రెండు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. తెలుగులోను రామ్‌చరణ్‌కు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నానని తెలిపారు.
ఇక తమిళంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం మేలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇందులో నగర ప్రాంత యువతిగా చాలా గ్లామరస్ పాత్రను పోషించనున్నట్లు చెప్పారు. తమిళంలో నన్బేండా చిత్రంలో మీరు నటించాల్సిన పాత్రను నయనతార తన్నుకుపోరుుందిగా అంటే, ఆ చిత్రంలో నటించే విషయం ఉదయనిధి స్టాలిన్‌తో చర్చించిన విషయం నిజమేనన్నారు. అయితే తాను కమిట్ అవ్వలేదని స్పష్టం చేశారు. అదే విధంగా కమల్ హాసన్ సరసన ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేకపోయానని కాజల్ తెలిపారు.
Advertisement
Advertisement