ఇండియాలో పదిహేను వందలే... చైనాలో పదివేలు!
టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాను తీయడం ముఖ్యం కాదు... హై స్టాండర్డ్ టెక్నికల్ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా విడుదల చేయడం ఇంపార్టెంట్! రజనీకాంత్ ‘2.0’ (‘రోబో’ సీక్వెల్) టీమ్ దీనిపైనే దృష్టి పెట్టింది. శంకర్ దర్శకత్వంలో సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కంప్లీట్ సిన్మాను త్రీడీలో తీశారు. ప్రేక్షకులు కూడా త్రీడీలో సిన్మాను చూసినప్పుడే అసలైన మజా. కానీ, ఇండియాలో త్రీడీ స్క్రీన్లు (థియేటర్లు) పదిహేను వందలలోపే ఉన్నాయి.
అందుకే వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ రిలీ జయ్యే టైమ్‌కి వీలైనన్ని థియేటర్లను త్రీడీ స్క్రీన్లుగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం చెన్నైలో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లతో ‘2.0 త్రీడీ డిజిటల్ మీట్’ ఏర్పాటు చేశారు. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ – ‘‘మన దేశంలో 1500 త్రీడీ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. చైనాలో పదివేలు ఉన్నాయి. ‘2.0’ రిలీజ్ టైమ్‌కి వీలైనన్ని థియేటర్లను త్రీడీ ప్రొజెక్షన్‌కు అనువుగా మార్చాలనుకుంటున్నాం. చైనాలోనూ సినిమాను రిలీజ్ చేయడానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నాం’’ అన్నారు. ‘‘తమిళనాడులో 300 థియేటర్లను ‘2.0’ టైమ్‌కి త్రీడీలోకి కన్వర్ట్ చేస్తాం’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ సుబ్రమణియమ్.