ఆయన నటన చూసి వీరాభిమానినయ్యా!
కుట్రం 23 చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అంటున్నారు యువ కథానాయకి మహిమా నంబియార్. ఎన్నై అరిందాల్ చిత్రంలో ప్రతినాయకుడిగా అజిత్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్న అరుణ్‌విజయ్ చిన్న గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుట్రం 23. అదే విధంగా సాట్టై తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన మహిమా నంబియార్ అంతే గ్యాప్ తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది. ఇందర్‌కుమార్ రేదర్ ది సినిమా పీపుల్ సంస్థతో కలిసి ఆర్తి అరుణ్ ఇన్ సినిమాస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ కుట్రం 23 చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మహిమా నంబియార్ తన ఆనందాన్ని పంచుకుంటూ దర్శకుడు అరివళగన్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో కాస్త భయపడ్డానన్నారు. ఆ రోజు ఉదయం నిర్వహించిన అడిషన్‌లో తాను ఓకే అవ్వడంతో సాయంత్రమే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశానన్నారు. ఎన్నై అరిందాల్ చిత్రంలో అరుణ్‌విజయ్ నటనా ప్రతిభను చూసి ఆయన వీరాభిమానినైపోయానన్నారు. అయితే షూటింగ్ తొలి రోజు అరుణ్‌విజయ్‌తో నటించే ముందు వరకూ ఒక రకమైన భయం కలిగిందన్నారు. అరుణ్‌విజయ్ సౌమ్యత, స్నేహశీల ప్రవర్తన ఆ భయాన్ని దూరం చేశాయన్నారు. ఇప్పటి వరకూ గ్రామీణ కథా పాత్రల్లో నటించిన తనుకు ఇందులో సిటీ అమ్మాయిగా నటించే అవకాశం అభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక దర్శకుడు అరివళగన్ తన చిత్రాలలో హీరోయిన్లను అందంగా చూపించడంతో పాటు వారి పాత్రలో నటనకు అవకాశం కల్పిస్తారన్నారు.
తన నట జీవితంలో కుట్రం 23 ఇక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెండ్రళ్ అనే పాత్రను చాలా ప్రేమిస్తూ నటిస్తున్నానని, దర్శకుడు కూడా ఈ పాత్రకు జీవం పోస్తున్నట్లు ప్రశంసించడం సంతోషంగా ఉందని, కుట్రం 23 చిత్రం తన సినీ జీవితాన్ని మలుపు తిప్పుతుందనే ఆశాభావాన్ని మహిమా నంబియార్ వ్యక్తం చేశారు.