ఎప్పటికీ ఆయన అభిమానినే: సన్నీ
ముంబై: ఇటీవలి ఓ ఇంటర్వ్యూ వివాదంతో మరోసారి వార్తల్లోకెక్కిన తార సన్నీలియోన్. ఈ దుమారంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నాపెద్దా అందరి నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా 'అగ్రనటుడు ఆమీర్ ఖాన్ తో నటించేందుకు మీరు సిద్ధమే.. కానీ మీతో నటించేందుకు ఆమీర్ ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నారు' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఇండో-కెనడియన్ స్టార్ సన్నీని ప్రశ్నించాడు. ఏవిధంగా, ఏ కోణంలో ఇలాంటి ప్రశ్నను ఆమెను అడగుతారని బాలీవుడ్ ఆమెకు బాసటగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆమీర్ నుంచి ఆమెకు మద్ధతు లభించడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఆ మరుసటి రోజే ఈ విషయంపై ఆమీర్ స్పందించాడు. మంచి కథ దొరికి పరిస్థితులు అనుకూలిస్తే సన్నీతో నటించేందుకు తనకేమాత్రం అభ్యంతరం లేదంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సన్నీ గతంలో తనకు అవసరం లేదని కూడా చెప్పాడు. ఆమీర్ వ్యాఖ్యలపై స్పందించిన సన్నీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. 'ఆమీర్ వ్యాఖ్యలను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. నేను ఆయనతో కలిసి సినిమాలో నటించినా, లేకపోయినప్పటికీ ఎప్పటికీ నేను ఆమీర్ అభిమానినే' అని తాజా ఇంటర్వ్యూలో తన మనసులో మాటను, అభిప్రాయాలను పోర్న్ స్టార్ సన్నీలియోన్ పంచుకుంది. ఇంటర్వ్యూలో సన్నీ ఇచ్చిన సమాధానాలు, ఆమె చూపిన ఓపిక ద్వారా రిషికపూర్, ఆలియా భట్, విర్ దాస్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తదితర నటీనటుల మద్ధతు కూడగట్టుకుంది.