సైకిల్‌కు రెండు చక్రాలం | Akhilesh Yadav-Rahul Gandhi bonhomie reflects in road show | Sakshi
Sakshi News home page

సైకిల్‌కు రెండు చక్రాలం

Published Mon, Jan 30 2017 6:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

సైకిల్‌కు రెండు చక్రాలం

సైకిల్‌కు రెండు చక్రాలం

ఎస్పీ సైకిల్‌కు హస్తం సారథ్యం
►  రాహుల్, అఖిలేశ్‌ వ్యాఖ్య
► బీజేపీ విభజన రాజకీయాలను తుదముట్టించాలని ప్రజలకు పిలుపు
► తొలిసారి సంయుక్తంగా ప్రెస్‌మీట్, రోడ్‌ షో


లక్నో: బీజేపీ విభజనవాద రాజకీయాలను తుదముట్టించాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌లు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఆదివారం లక్నోలో సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తర్వాత రోడ్‌ షో నిర్వహించారు. దాదాపు ఒకే రకం దుస్తులు ధరించిన యువనేతలు అన్యోన్యంగా కనిపించారు. తామిద్దరం ఒక సైకిల్‌కున్న రెండు చక్రాలమని పేర్కొన్నారు. ‘మా ఇద్దరి వయసుల్లో పెద్ద తేడా లేదు.

ఈ రోజు ఆరంభం మాత్రమే. మేమిద్దరం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం’ అని అఖిలేశ్‌ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీల పొత్తు బీజేపీ విభజన, కక్షపూరిత రాజకీయాలకు సమాధానం(ఉత్తర్‌) అని రాహుల్‌ అన్నారు. ‘మా పొత్తు ప్రజల ఆకాంక్ష. ఇది గంగ, యమునల సంగమం. అందులోంచి సరస్వతి అనే అభివృద్ధి వెలువడుతుంది.. ఇది హృదయాల బంధం. మేం కలసి విజయం సాధిస్తాం’ అని పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఒక్కటిగా ఉన్నారని, ఈ పొత్తు ద్వారా ప్రధాని మోదీకి చెబుతున్నామన్నారు. గంటపాటు సాగిన విలేకర్ల సమావేశంలో ఇద్దరు నేతలు.. ‘కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు అయిన హస్తం ఎస్పీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ప్రగతి, అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తుంది’ అని చెప్పారు.

తన సోదరి ప్రియాంక, అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌లు రెండు పార్టీల తరఫున ప్రచారం చేస్తారా అని రాహుల్‌ను విలేకర్లు అడగ్గా.. ‘ప్రియాంక నాకెంతో సాయం చేస్తోంది. ఆమె మా పార్టీకి పెద్ద అండ. ప్రచారం చేయాలా, వద్దా అన్నది ఆమె నిర్ణయించుకోవ్సాలిన అంశం’ అని అన్నారు.  ప్రచారంపై డింపులే నిర్ణయం తీసుకుంటారని అఖిలేశ్‌ అన్నారు. పొత్తు.. మూడు ‘పీ’ల(ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ, పీస్‌) కోసమని రాహుల్‌ చెప్పగా, ప్రజల(పీపుల్‌) కోసమని అఖిలేశ్‌ మరో పీని జతచేశారు. ‘యూపీకి మా పొత్తు పసందు’ అంటూ ఆలింగనం చేసుకున్నారు.  

మాయకు చాలా స్థలం కావాలి: అఖిలేశ్‌
కాంగ్రెస్, ఎస్పీల జట్టులోకి మాయావతి సారథ్యంలోని బీఎస్పీ కూడా చేరే అవకాశముందా అని అఖిలేశ్‌ను విలేకర్లు ప్రశ్నించగా ఆయన సరదాగానే అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జట్టులో ఆమెకు స్థలమెక్కడ ఇవ్వగలం? ఆమెకు చాలా స్థలం కావాలి. ఆమె పార్టీ ఎన్నికల గుర్తు కూడా ఏనుగు’ అని అన్నారు. తాను ఇకపై మాయావతిని అత్త అని అననన్నారు.  ‘బీఎస్పీ ప్రభుత్వం తప్పులు చేసి ఉండొచ్చు. అయితే మాయావతీజీ(బీఎస్పీ చీఫ్‌)పై నాకు గౌరవముంది’ అని రాహుల్‌ పేర్కొన్నారు. 2006 నాటి కాంగ్రెస్‌–బీఎస్పీ పొత్తు తప్పిదమని, ఇప్పటి పొత్తు(ఎస్పీతో) కూడా తప్పు కావొచ్చని, చరిత్ర మారుతూ ఉంటుందని అన్నారు. విలేకర్ల సమావేశం తర్వాత రాహుల్, అఖిలేశ్‌లు ‘యూపీ విజయ్‌ రథ్‌’లో 12 కి.మీ. రోడ్‌ షో ప్రారంభించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల గుండా ఇది సాగింది.   

ప్రచారం చేయను: ములాయం
కాంగ్రెస్, ఎస్పీల పొత్తును ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం తప్పుబట్టారు. ఆ పార్టీల జట్టుకు ప్రచారం చేయనని, ఒంటరిగా పోటీ చేసే సత్తా ఎస్పీకి ఉందని అన్నారు.  సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ దేశాన్ని వెనక్కు నెట్టిందని ఆరోపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement