ఎస్‌ఐని నీటిలో ముంచి..
ముంబై/థానే: మహారాష్ట్రలో పోలీసులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఓ ఎస్‌ఐని నలుగురు యువకులు నీటిలో ముంచి చంపేందుకు ప్రయత్నించారు. థానే జిల్లాకు చెందిన కల్యాణ్ టౌన్‌షిప్ తీస్‌గావ్ చెరువులో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారని మంగళవారం రాత్రి 9.30 గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. నిమజ్జనం సక్రమంగా జరగడానికి సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ ధాగ్లే (38) అక్కడికి వెళ్లి జనాన్ని అదుపు చేస్తున్నారు. జరీ మారి గణేశ్ ఉత్సవ్ మండల్‌కు చెందిన కొందరు సభ్యులను క్యూ పాటించమన్నారు.
వారు నితిన్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిలో నలుగురు అతన్ని చెరువులో ముంచి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నితిన్ అతికష్టం మీద వారి నుంచి తప్పించుకుని బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ మేరకు వారు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతోంది. దీంతో పోలీసులు నలుగురు యువకులపై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. గత నెల 31న మహారాష్ట్రలో ఇద్దరు యువకులు దాడి చేయడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ విలాస్ షిండే మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తమ ప్రభుత్వం పోలీసుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. . వారి సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటుందన్నారు.