మరో వివాదంలో లలిత్ మోదీ
* రాష్ట్రపతి ప్రతిష్టను దెబ్బతీసేలా ట్వీట్‌లు
* పోలీసులకు రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో పోస్టింగ్‌లు చేశారని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై రాష్ర్టపతి భవన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ జూన్ 23, 25న ట్విటర్‌లో పోస్ట్ అయిన చిత్రాలను, ఇతర వివరాలను ఫిర్యాదు కాపీతో ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు పంపింది.
రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్, వివేక్ నాగ్‌పాల్ అనే వ్యాపారవేత్త ఫొటోను లలిత్ ట్విటర్‌లో పెట్టారు. రాష్ట్రపతి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నాగ్‌పాల్ ఆయననుంచి లబ్ధిపొందారని ఆరోపించారు. గతంలో కొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాదారుల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు తనపై ప్రణబ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విచారణకు ఆదేశించారని మరో ఆరోపణ చేశారు.
ఈ వివాదం వల్ల అప్పట్లో శశిథరూర్ కేంద్రమంత్రి పదవినుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా, ఈ ఫిర్యాదును పోలీసు కమిషనర్ తదుపరి చర్యలకోసం ఆర్థికనేరాల విభాగానికి పంపించారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఐపీసీ కింద కేసు నమోదు చేయాలా లేక, ట్వీటర్‌లో ఆ పేజీని బ్లాక్ చేయించడానికి స్థానిక కోర్టును ఆశ్రయించాలా అన్న దానిపై పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.