న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం డీఆర్‌డీఓ అనేక నూతన ఆవిష్కరణలు చేస్తోందని ఆ సంస్థ చెర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. శానిటైజర్లు, మాస్క్‌లు, వెంటిలేటర్స్ తయారు చేయడంతో పాటు.. నాలుగైదు లక్షల లీటర్ల శానిటైజర్ బాటిల్స్ పంచినట్లు తెలిపారు. ప్రతిరోజు 25 వేల ఎన్ 99 మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న టెక్నాలజీని అవసరమైన పరిశ్రమలకు అందజేస్తున్నామని తెలిపారు. ఐసీయూలో పనిచేసే వైద్యుల కోసం ప్రత్యేకంగా ఫుల్ మాస్క్ కిట్లను రూపొందించామన్నారు. టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు తాము జరపడం లేదని తెలిపిన సతీష్‌రెడ్డి.. చిత్ర అనే సంస్థ దీనిపై పని చేస్తోందని పేర్కొన్నారు. అయితే తాము ఆ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్ఫ్రారెడ్ థర్మమీటర్‌ని తయారు చేశాం. టచ్ చేయకుండా ఉపయోగించే శానీ టైసింగ్ కిట్లను రూపొందించాం. రేపటి నుంచి ఆఫీసులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి. కేవలం ఐదు వేల రూపాయలకు ఈ బాక్స్ అందుబాటులో ఉన్నాయి. డీఆర్‌డీఓలో తయారు చేసిన పీపీఈలు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. పీపీఈ కిట్లను సర్టిఫై చేసేందుకు ప్రత్యేకంగా భూపాల్‌లో ఉన్న మా ల్యాబ్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించాం. హైదరాబాదులో 20 వేల ఫుల్ ఫేస్ మాస్క్‌లను తయారు చేసి పంచాము. ఏరో సిల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌ను కూడా డాక్టర్ల కోసం తయారు చేసి ఆసుపత్రులకు ఇచ్చాం. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆస్పత్రి సహకారంతో వీటిని రూపొందించాము.
ఒక వెంటిలేటర్ అనేక మందికి ఉపయోగపడేలా..
ప్రతిసారీ పీపీఈ సూట్ ధరించకుండా నేరుగా ఒక ప్రత్యేక చాంబర్ తయారుచేశాం. ఈ చాంబర్ ద్వారా డాక్టర్‌లు రోగులను నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో డాక్టర్లు సేఫ్ ఉంటారు. ఒక వెంటిలేటర్‌ను అనేకమందికి ఉపయోగించేలా ప్రయోగం చేశాం. ఈ ప్రయోగాన్ని పరీక్షించి మరింతగా మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలో ఈ పరికరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫుల్ బాడీ చాంబర్ లను తయారు చేస్తున్నాం. ప్రతిసారి బాటిల్ పట్టుకోకుండా రిమోట్ సెన్సింగ్‌తో బాటిల్ స్ప్రే చేసుకునేలా బాక్స్ రూపొందించాం. ప్రతి ఆఫీసు ఎంట్రెన్స్‌లో ఈ బాక్స్‌ను పెట్టుకోవచ్చు.
అల్ట్రా వైలెట్ టెక్నాలజీ తో శానిటైజ్ చేసే టెక్నాలజీ రూపొందించాం.
అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది..
టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు మేము జరపడం లేదు. చిత్ర అనే సంస్థ టెస్ట్ కిట్లపై పని చేస్తుంది. ఆ సంస్థలకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. వీలైనంతవరకు టెస్టులు పెరగాలి. అయితే అందరికీ కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాదు. బయో వార్ , వైరస్ లను ఎదుర్కొనేందుకు అన్ని మంత్రిత్వశాఖలు కలిసి ప్రయోగాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను తాము చేసే పనిలో భాగంగానే రూపొందిస్తున్నాయి. ఈ ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే సఫలీకృతమవుతాయి. దాంతో దేశంలోని సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ముప్పు ను అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది.
రక్షణ శాఖ అప్రమత్తంగా ఉంది..
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకున్నారు. మాస్కులు, మందులు, వ్యాక్సిన్లు తయారీ ద్వారా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో ఈ ప్రయోగాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ముంబై నౌకాదళంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రిత్వ శాఖ.. అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ పూర్తి సంసిద్ధత తో ఉంది. ఎక్కువ పరిశ్రమలకు టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా భారీ సంఖ్యలో వెంటిలేటర్లు తయారు చేస్తున్నాము. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ సింగ్ అందరూ పాటించాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment