ప్రతికాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు సంబంధించి 55 మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న మహారాష్ట్ర నుంచి ఏడుగురు, ఒడిశా నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఏప్రిల్ 9న ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు, అసోం నుంచి ముగ్గురు, బిహార్ నుంచి ఐదుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి నలుగురు, హరియాణా నుంచి ఇద్దరు, హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఒకరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, మణిపూర్ నుంచి ఒకరు, రాజస్తాన్ నుంచి ముగ్గురు సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. అలాగే ఏప్రిల్ 12న మేఘాలయ నుంచి ఒక సభ్యుడి పదవీకాలం పూర్తవుతుంది.
పదవీ విరమణ పొందుతున్న వారు వీరే..
ఏపీ నుంచి మొత్తం 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), కె.కేశవరావు (టీఆర్‌ఎస్), టి.సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్), తోట సీతారామలక్ష్మి (టీడీపీ) ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి మోహన్‌రావు (బీజేపీ) పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 1వ షెడ్యూలు ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని 18 మంది సభ్యుల్లో 11 మందిని ఏపీకి, ఏడుగురిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎంఏ ఖాన్‌లు సాంకేతికంగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది. అలాగే ఏపీకి చెందిన కేవీపీ రామచంద్రరావు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment