సాక్షి, బొమ్మనహళ్లి : బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో కంగుతిన్నాడు. దయానందరెడ్డి అనే యువకుడు లక్కసంద్ర రెండో క్రాస్‌లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ.6 వేల నగదు డ్రా చేయగా మూడు రూ.2 వేల నోట్లు వచ్చాయి. సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లిన దయానందరెడ్డి రూ.2 వేల నోటు ఇవ్వగా అది నకిలీ నోటు అని సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు.
నోటును నిశితంగా పరిశీలించగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట, దిస్ ఈజ్ షాటింగ్ పర్పస్ ఓన్లీ అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉంది. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని, యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్లి నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.
అసలు నోట్లను గుర్తించండిలా..
కొత్త రూ.2 వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66 మి.మీ, వెడల్పు 166 మి.మీ.గా ఉంటుంది.
ముందు భాగం
1. లైటు వెలుతురులో రూ.2000 సంఖ్యను గమనించవచ్చు.
2. నోటును కొంచెం వొంచి చూస్తే 2000 సంఖ్య కనిపిస్తుంది.
3. దేవ నాగరి లిపిలో రూ.2000 సంఖ్య రాసి ఉంటుంది.
4. మహాత్మా గాంధీ బొమ్మ మధ్య భాగం వైపునకు ఉంటుంది.
5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 ఉంటాయి.
6. నోటును ఏటవాలుగా పట్టుకుంటే దారం పోగు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగుకు మారుతుంది.
7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు
8. మహాత్మగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్
9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తాయి
10. కింది భాగంలో కుడివైపున రూపాయి చిహ్నంతో సహా రంగు మారే సిరాతో (ఆకుపచ్చ నుంచి నీలం) 2000 ఉంటుంది.
11. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం
అంధుల కోసం
12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.2000 సంఖ్య ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉంటుంది.
13. కుడి వైపున, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముంద్రించిన ఏడు చిన్న చిన్న గీతలు ఉంటాయి.
వెనుక భాగం
14. నోటు ముద్రించిన సంవత్సరం ఎడమ వైపున ఉంటుంది.
15. నినాదంతో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది.
16. మధ్య భాగంలో వివిధ భాషల ప్యానల్ ఉంటుంది.
17. మార్స్ పైకి ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ చిత్రం ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment