హనీప్రీత్ గురించి విపాసన ఏం చెప్పారంటే..
హనీప్రీత్ గురించి విపాసన ఏం చెప్పారంటే..
Published Tue, Sep 19 2017 11:07 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
సాక్షి,చండీగర్: డేరా సచా సౌథా చైర్‌పర్సన్ విపాసనా ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చారు. డేరా చీఫ్ గుర్మీత్‌ను దోషిగా నిర్దారించిన అనంతరం ఆగస్ట్ 25న హింస చెలరేగిన తర్వాత ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ సిర్సాకు వచ్చిందని పోలీసుల విచారణలో విపాసన వెల్లడించారు. హనీప్రీత్‌ను రోహ్తక్ నుంచి సిర్సాకు తీసుకువచ్చేందుకు తాను వాహనం సమకూర్చానని డీఎస్‌పీ కుల్దీప్ బెనివల్ నేతృత్వంలోని సిట్ బృందానికి విపాసన చెప్పారు. మూడున్నర గంటల పాటు విపాసనను సిట్ బృందం ప్రశ్నించింది. ఆగస్టు 27 తర్వాత సిర్సా నుంచి హనీప్రీత్ అదృశ్యమయ్యారని, అప్పటి నుంచి డేరా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లతో ఆమె టచ్‌లో లేరని చెప్పారు.
గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించకముందు, ఆ తర్వాత డేరా ప్రాంగణంలో నెలకొన్న పరిస్ధితి గురించి విపాసనను సిట్ టీమ్ ప్రశ్నించినట్టు సమాచారం. హనీప్రీత్ వెంట ప్రదీప్ గోయల్ ఇన్సాన్, ప్రకాష్ కుమార్ అలియాస్ విక్కీలు ఉన్నారని విపాసన వెల్లిడించినట్టు డీఎస్‌పీ బెనివల్ చెప్పారు. గోయల్, ప్రకాష్‌లు డేరా ప్రతనిధి ఆదిత్యా ఇన్సాన్ బంధువులు కావడం గమనార్హం.వీరిని ఉదయ్‌పూర్, మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు పంచకుల సిట్ వద్ద కస్టడీలో ఉన్నారు.
Advertisement