సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫారం కోసం అపోలో ఆస్పత్రిలో అప్పటికే మరణించిన జయలలిత నుంచి వేలిముద్రలు సేకరించారని డీఎంకే వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ ఆరోపించారు. సంబంధిత ఆధారాలను జయ మరణంపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిషన్‌కు బుధవారం ఆయన అందజేశారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించడం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి.
పోటీలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీఫారంలపై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయ సంతకం చేయాల్సి ఉంది. దాంతో అప్పటికే మరణించిన జయ వేలిముద్రలను బీఫారంలపై వేయించారని శరవణన్ కమిషన్ ముందు వాంగ్మూలమిచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు బాలాజీ సమక్షంలోనే జయ స్వయంగా వేలిముద్రలు వేశారని అప్పట్లో అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. జయ త్వరగా కోలుకుంటున్నారని చికిత్స రోజుల్లో అపోలో ఆస్పత్రి బులెటిన్లు కూడా విడుదల చేసింది.
ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి కావాలనేది జయ అభీష్టమని అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి స్వయంగా ప్రకటించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం త్వరలో అమ్మ డిశ్చార్జి అంటూ ప్రచారం చేశాయి. కానీ, జయ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలు పెరిగాయి. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నా డీఎంకే చీలిక నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు పట్టుపట్టారు.
దీంతో జయ మరణంపై రిటైర్డు జడ్జి నేతృత్వంలో సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణం వరకు జరిగిన ఘటనలపై నవంబర్ 22లోగా ప్రమాణపత్రాలివ్వాలని సంబంధిత వ్యక్తులను కమిషన్ ఆదేశించింది. జయ నివాసం పోయెస్ గార్డెన్‌లోని సిబ్బంది, అపోలో వైద్యులు, జయకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు, ఎయిమ్స్ డాక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు, ఉన్నతాధికారులు తదితరులకు ఈ సమన్లు ఇచ్చింది. కాగా, కమిషన్‌కు ఇప్పటివరకు 12 ప్రమాణపత్రాలు, 70కి పైగా అఫిడవిట్లు అందాయి. డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు..ఇలా మొత్తం ఏడుగురు ప్రమాణపత్రాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment