కొడుక్కి టికెట్‌.. తండ్రి గరంగరం! | Khem Karan Congress ticket battle in Punjab | Sakshi
Sakshi News home page

కొడుక్కి టికెట్‌.. తండ్రి గరంగరం!

Published Sun, Dec 25 2016 12:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కొడుక్కి టికెట్‌.. తండ్రి గరంగరం! - Sakshi

కొడుక్కి టికెట్‌.. తండ్రి గరంగరం!

అమృత్‌సర్‌: రాజకీయాల్లో సాధారణంగా కొడుకుకు టికెట్‌ కావాలని పైరవీలు చేసే తండ్రులను చూస్తుంటాం. తాము పోటీ చేసే స్థానాన్ని కొడుకు కోసం 'త్యాగం' చేసే తండ్రులనూ చూస్తాం. అయితే.. పంజాబ్‌లో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా.. ఏమాత్రం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించని విధంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఆసక్తిగా ఉంది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖేమ్‌ కరణ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుఖ్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తికి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఖరారైంది. సుఖ్‌పాల్‌కు టికెట్‌ దక్కినందుకు అత్యంత బాధపడేది ఎవరంటే.. ఆ టికెట్‌ను ఆశించిన అతడి తండ్రి గురుచేత్‌ సింగ్‌‌, సోదరుడు అనూప్‌ సింగ్‌.

గురుచేత్‌ సింగ్‌(75) ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు లేఖ రాశారు. ఖేమ్‌ కరణ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం తన ఇద్దరు కుమారులకు కాకుండా తనకే ఇవ్వాలంటూ లేఖలో గురుచేత్‌ సింగ్‌ అభ్యర్థించారు. తన ఇద్దరు కుమారుల మధ్య వివాదాలున్నాయని.. వారిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీకి నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిన గురుచేత్‌ సింగ్‌ 2007, 2012 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తన వంతుగా అనూప్‌ సింగ్‌ సైతం సోనియా గాంధీకి లేఖ రాశారు. తన సోదరుడిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయని, అతడికి క్లీన్‌ ఇమేజ్‌ లేనందున టికెట్‌ తండ్రికి కేటాయించాలని ఆయన కోరారు. ఇందిరా గాంధీ హంతకులకు నివాళులర్పించే కార్యక్రమానికి సైతం సుఖ్‌పాల్‌ హాజరయ్యాడని చెబుతూ.. దానికి సంబంధించిన న్యూస్‌ పేపర్‌ క్లిప్పంగ్‌లను సైతం లేఖకు అనూప్‌ జతచేశాడు. టికెట్‌ పొందిన సుఖ్‌పాల్‌.. తాను 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నానని.. 2012 ఎన్నికల్లో తండ్రి పోటీ చేసే సమయంలోనే.. 2017లో తానే అని కుటుంబం నిర్ణయం తీసుకుందని చెబుతున్నాడు. చూడాలి మరి ఇంట్లోనే ఉన్న ఇద్దరు అసంతృప్తులతో సుఖ్‌పాల్‌ ఎలా నెగ్గుకొస్తాడో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement