ఓ చేత్తో ట్రాక్టర్.. మరో చేత్తో ట్వీటర్
మంద్‌సౌర్: నాలుగైదు రోజుల్లోనే మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన ఉద్యమ రూపం తీసుకుంది. పక్కా ప్రణాళికతోనే వ్యూహాత్మకంగా ఉవ్వెత్తున ఎగిసింది. దినమంతా పొలంలో పనిచేసి రాత్రి ఇంటికెళ్లి తిని పడుకునే పాతకాలం రైతులు కాదు ఇక్కడివారు. మంద్‌సౌర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వ్యవసాయం చేస్తున్న వారిలో 16–30 ఏళ్ల మధ్య వయస్సు రైతులూ ఉన్నారు. వీరంతా వ్యవసాయంతోపాటు సాంకేతికతనూ ఒంటబట్టించుకున్నారు. తమ పెద్దలకు కూడా సాంకేతికతను నేర్పించారు. సామాజిక మాధ్యమాన్ని ఎలా విరివిగా వాడాలో వీరికి బాగా తెలుసు. అందుకే మద్దతు ధర కోసం మొదలైన ఆందోళన దేశాన్నే ఆకర్షించిన ఉద్యమంగా మారటం వెనక ఈ యువ రైతులే కీలకంగా వ్యవహరించారు.
ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ల ద్వారా ఆందోళనల ఫొటోలు, వీడియోలు, వార్తలను ఎప్పటికప్పుడు పోస్టుచేస్తూ విస్తృతంగా సమాచారాన్ని ప్రసారం చేశారు. ‘ఓ చేత్తో ట్రాక్టర్ స్టీరింగ్.. మరో చేత్తో ఫోన్ పట్టుకుని ట్వీట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అని ఆందోళన చేస్తున్న రైతులకు అందిన అనధికార సమాచారమిది. దీన్నిబట్టి ఈ అన్నదాతల ఆందోళనలో సోషల్‌మీడియా పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. ‘రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఇంటర్నెట్ ద్వారా ఉద్యమం నడిచింది. ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజలకు మన సమస్యలు చెప్పాలని రైతులకు విన్నవించాం’ అని ఆమ్ కిసాన్ యూనియన్ నాయకుడు కేదార్ సిరోహీ తెలిపారు.
మొదటగా జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఆందోళన చేయాలనుకున్నామని అయితే.. ఆరుగురు రైతుల మృతితో దీన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు సిరోహీ వెల్లడించారు. అంతేకాదు, సామాజిక మాధ్యమంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి.. ఒక నాయకుడంటూ కనిపించకపోవటంతో ఎవరితో చర్చించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. ఇదే ఉద్యమం విజయవంతం అవటానికి ఓ కారణం కూడా. అయితే, పుకార్లను, రెచ్చగొట్టే వ్యాఖ్య లను, వాస్తవంలేని వార్తలను విస్తృతంగా ప్రచారం చేయటంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని.. దీంతో మందసౌర్‌తోపాటుగా ఉజ్జయిని, రత్లాం, నీముచ్, ధార్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితి నియంత్రణలోకి వచ్చేంతవరకు ఈ సేవలను పునరుద్ధరించబోమని స్పష్టం చేశారు.