మన్మోహన్ సింగ్కు సమస్యల స్వాగతం
విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం స్వదేశం తిరిగొస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్కు కొత్త సమస్యలు స్వాగతం పలకనున్నాయి. దౌత్య సంబంధాలు, సరిహద్దు సమస్యల గురించి వివిధ దేశాధినేతలతో చర్చించిన ప్రధానికి భారత్ రాగానే సొంత పార్టీ నుంచే సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరచరిత చట్టసభ్యుల ఆర్డినెన్స్పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనను ఇరుకున పెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం అర్థంలేని విషయమని రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే.
రాహుల్ వ్యాఖ్యలను ప్రధానిని అవమానించే విధంగా ఉన్నాయని, మన్మోహన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదాస్పద ఆర్డినెన్స్ను కేంద్రం రద్దు చేసే అవకాశముంది. కాగా ఈ మొత్తం పరిణామం మన్మోహన్కు ఇబ్బందికర పరిణామమే. దీనికి తోడు సరిహద్దు సమస్యలపైనా విపక్షాలు దాడి చేసే అవకాశముంది. విదేశీ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థాన్ ప్రధాని మంత్రి నవాజ్ షరీఫ్తో మన్మోహన్ కీలక అంశాలపై చర్చలు జరిపారు.