మసాజ్.. అతడి ప్రాణాలు తీసింది
మసాజ్.. అతడి ప్రాణాలు తీసింది
Published Fri, Dec 23 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని మసాజ్ చేయించుకోడానికి వెళ్తే.. మెడ ఎముక విరిగి ప్రాణాలు కోల్పోయాడు! ఈ ఘటనపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిగిన తర్వాత.. అతడి ప్రాణాలు పోవడానికి మసాజే కారణమని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. దానిపై ఇన్నాళ్ల పాటు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత. మసాజ్ సెంటర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. 2015 డిసెంబర్ 12వ తేదీన నజీరాబాద్ ప్రాంతానికి చెందిన హర్నభ్ సింగ్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పార్టీలో ఉండగా తనకు మెడ బాగా నొప్పిగా ఉందని చెబుతూనే కుప్పకూలిపోయాడు.
అతడికి నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో.. స్థానికంగా ఉండే మధు ఠాకూర్ అనే వ్యక్తికి సింగ్ తల్లి ఆ విషయాన్ని చెప్పారు. అది ఎలా తగ్గుతుందో తనకు తెలుసని అతడు చెప్పి, దగ్గర్లో ఉన్న మసాజ్ పార్లర్‌కు వెళ్లమని సూచించాడు. అయితే.. హర్నభ్‌కు అక్కడ చేసిన మసాజ్ కారణంగా మెడ ఎముకల్లో ఒకటి విరిగిపోయి, అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్తప్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు అతడి మృతికి కచ్చితమైన కారణం ఏంటో చెప్పకపోవపడంతో కేసు నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. చివరకు వైద్య, న్యాయ నిపుణులతో కూడిన బృందం క్షుణ్ణంగా విచారణ జరిపి, అతడి మెడ ఎముక విరిగిన తర్వాతే మరణించాడని, అందుకు కారణం మసాజ్ అని తేల్చడంతో ఇన్నాళ్లకు కేసు నమోదు చేశారు.
Advertisement