సాక్షి, ఆగ్రా : కేవలం ఓట్ల కోసం జనాల దగ్గరికి క్యూ కట్టే కొందరు నేతలు.. తర్వాత వారిని పట్టించుకోకుండా ముఖం చాటేయడమనే వ్యవహారం కొత్తేం కాదు. కానీ ఇక్కడ.. తన మానాన తాను పోకుండా పక్కవాడి ప్రాణాలు కాపాడాలన్న ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నం హర్షణీయంగా మారింది.
ఉత్తర ప్రదేశ్ ఫర్రూఖాబాద్‌లో శుక్రవారం సాయంత్రం బీమ్‌సేన్ మార్కెట్‌లో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సర్దార్ నియోజకవర్గ ఎమ్మెల్యే మేజర్ సునీల్ దత్ ద్వివేదీ ఘటనను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. తన సిబ్బంది సహయంతో ఆ ముగ్గురిని సమీపంలోని లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ ఎమ్మెల్యే గన్ మెన్, మరో అనుచరుడు ఇద్దరిని స్ట్రెచ్చర్‌పై ఆస్పత్రిలోకి లోపలికి తీసుకెళ్లారు. అయితే మరో బాధితుడి కోసం స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవటంతో ఆ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే తన వీపు మీద అతన్ని మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ‘‘ ఆ సమయంలో ఆ వ్యక్తి బాధతో విలపిస్తున్నాడు. ఆలస్యం చేయటంసరికాదని భావించా. వెంటనే వీపుపై మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లా. అయినా సాటి మనిషికి ఆ మాత్రం సాయం చేయటం నా బాధ్యత’’ అని ద్వివేదీ పేర్కొన్నారు. తనకు సాయం చేసిన ఎమ్మెల్యేకు బాధితుడు అరవింద్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలియజేయగా.. పలువురు స్థానికులు ఎమ్మెల్యే ద్వివేదీ చేసిన పనిని అభినందిస్తున్నారు.