సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ దగ్గరలోనే ఓ గ్రామంలోని పాడుపడిన బావి నుంచి ఇటీవల వెయ్యి రాకెట్లు (తారాజువ్వల వంటివి) బయటపడ్డాయి. లండన్ మ్యూజియంలో భద్రపరిచిన రాకెట్లతో ఇవి పోలి ఉండడంతో పాటు టిప్పు సుల్తాన్ కాలం నాటివిగా భావిస్తున్న ఇలాంటి రాకెట్లనే మరి కొన్నింటిని కొంత కాలం క్రితమే వెలికి తీశారు. దీంతో దాదాపు 250 ఏళ్ల క్రితమే టిప్పు సుల్తాన్ శత్రువుపై ముఖ్యంగా ఇంగ్లీష్ బలగాలు మైసూరు రాజ్యంలోకి అడుగుపెట్టకుండా ఎలాంటి యుద్ధనీతులు, సైనికవ్యూహాలతో పాటు ఎలాంటి వినూత్న ఆయుధాలు ఉపయోగించి ఉంటాడనేది చర్చనీయాంశమైంది.
ఆంగ్లేయులతో మైసూరు రాజ్యానికి జరిగిన యుద్ధాల్లో ‘రాకెట్‌వ్యూహం’ విస్తృతంగా ఉపయోగించినట్టు వెల్లడైంది. ‘శత్రువు ఉపయోగించిన మందుగుండు, ఇతర ఆయుధాల కంటే కూడా రాకెట్ల వల్లనే బ్రిటీష్ సైన్యానికి ఎక్కువ నష్టం వాటిల్లింది’ అని చరిత్రకారులు ఎల్.డే, ఐ.మెక్‌నీల్ తమ గ్రంథం ‘బయోగ్రఫికల్ డిక్షనరీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ టెక్నాలజీ’లో పేర్కొన్నారు. టిప్పు బలగాలు మెరుగైన సైనిక నైపుణ్యాలు కలిగి ఉన్న కారణంగా నాలుగో యుద్ధంలో దౌత్యపరమైన నైపుణ్యాలతోనే మైసూరు సైన్యంపై బ్రిటీష్‌సైన్యం చివరగా గెలుపొందగలిగిందనే అభిప్రాయంతో చరిత్రకారులున్నారు.
అసలేమిటీ రాకెట్ల చరిత్ర ?
19వ శతాబ్దం మొదట్లో నెపోలియన్ యుద్ధాల్లో భాగంగా ఫ్రాన్స్‌తో బ్రిటన్ తలపడినపుడు అప్పటి వరకు ఐరోపా ఖండంలోనే ఎవరు ఉపయోగించని ‘కాంగ్రీవ్ ర్యాకెట్’లు ప్రయోగించింది. ఇంగ్లిష్ సైన్యానికి చెందిన సర్ విలియమ్ కాంగ్రీవ్ దీనిని కనిపెట్టినట్టు భావిస్తున్నారు.18వ శతాబ్దం ప్రారంభంలో పలు ప్రయోగాలు నిర్వహించాక ‘మండే తారాజువ్వలు’ కాంగ్రీవ్ తయారుచేశారు. యుద్ధంలో వినియోగించినపుడు బాగా ప్రభావం చూపడంతో ఈ ర్యాకెట్లపై డెన్మార్క్, ఈజిప్ట్, ప్రాన్స్, రష్యా, ఇతర దేశాల మిలటరీ ఇంజనీర్ల దృష్టిని ఆకర్షించింది.
అయితే 19వ శతాబ్దం మధ్యలో చరిత్రకారులు బ్రిటీష్ మిలటరీ చరిత్ర, నేపథ్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసినపుడు కాంగ్రీవ్ రాకెట్ మూలాలు భారత్‌లో మరీ ముఖ్యంగా టిప్పు సుల్తాన్ రాజ్యంలో ఉన్నట్టు గుర్తించారు. కొన్ని శతాబ్దాల క్రితమే మండే బాణాల రూపంలో ఐరోపా దేశాల్లో వీటిని ఉపయోగించినా, టిప్పుకాలంలోనే వీటిని ఆధునీకరించడంతో ‘మైసూరు రాకెట్లు’గా ఇవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ‘ప్రధానంగా ఇంథనం పట్టి ఉంచేందుకు వీలుగా ఇనుపగొట్టాలు వినియోగించిన కారణంగా బ్రిటీషర్లకు తెలిసిన, చూసిన వాటి కంటే కూడా టిప్పు కాలం నాటి రాకెట్లు ఎంతో అధునాతనమైనవి’ అని శాస్త్రవేత్త రొద్దం నరసింహ పేర్కొన్నారు.
ఏమిటీ ప్రత్యేకత ?
ఇనుప గొట్టంతో తయారుచేసిన ఈ రాకెట్లు (ఇవి వివిధ సైజుల్లో ఉంటాయి) ఓ చివర మూసివేస్తారు. వెదురుబద్ధకు ఓ ట్యూబ్‌ను జతచేశాక అది మండే వాహకంగా (కంబాషన్ ఛాంబర్)గా పనిచేస్తుంది. వాటిలో గన్‌ఫౌడర్‌ను ఇంథనంగా ఉపయోగిస్తారు. ఈ రాకెట్లు 500 గ్రాముల గన్‌ఫౌడర్‌తో 900 మీటర్ల వరకు లక్ష్యాలు చేధించేలా రూపొందించారు. గతంలో ఐరోపా, చైనాతో సహా ఇండియాలోనూ కనుక్కున్న రాకెట్లలో (ఇనుప కేసింగ్ లేనివి కూడా) ఇంత ఎక్కువ దూరం వెళ్లలేకపోయినట్లు గుర్తించారు.
ఈ రాకెట్ల ఉన్నతస్థాయి యాంత్రిక నిర్మాణంలో ఇనుము, స్టీలు, గన్‌పౌడర్‌ను మంచి మిశ్రమంగా ఉపయోగించిన తీరు అద్భుతమని చరిత్రకారులు హెచ్‌ఎం ఇఫ్తకార్ జామ్, జాస్మిన జైమ్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ పర్యవేక్షణలో ర చించిన ‘ద ఫతూల్ ముజాహిదీన్’ మిలటరీ మ్యానువల్‌లో సైనికదాడుల్లో రాకెట్ల వినియోగం గురించి వివరంగా రాశారు. ప్రతీ సైనికదళంతోనూ ‘జౌక్’గా పిలిచే రాకెట్‌సైన్యం ఉండేది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్‌అలీ కాలంలో 1200 మంది ఉన్న రాకెట్‌సైన్యం, టిప్పు కాలం నాటికి 5 వేల మందికి చేరుకుందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
- సాక్షి, నాలెడ్జ్‌సెంటర్
Comments
Please login to add a commentAdd a comment