కులభూషణ్ తల్లి పిటిషన్‌ను పరిగణిస్తున్నాం: పాక్
ఇస్లామాబాద్: కులభూషణ్ జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ వేసిన ఆయన తల్లి వేసిన పిటిషన్ తమకు చేరిందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాన సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఆ పిటిషన్‌ను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కులభూషణ్‌కు పాక్ విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్‌ను ఏప్రిల్ 26న ఆయన తల్లి పిటిషన్ వేసింది. దీనిని భారత హైకమిషనర్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శికి అందజేశారు.
తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారనే ఆరోపణలతో పాకిస్థాన్ జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొల్పింది. ఇప్పటికే పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలిన విషయం తెలిసిందే. అయితే, పాక్ మాత్రం దీనిపై స్పందిస్తూ ‘పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓడిపోయిందని చెప్పడం పూర్తిగా తప్పవుతుందని, కోర్టు కేవలం ఉరి శిక్షపై స్టే మాత్రమే విధించిందనే విషయం గుర్తించాలని అజీజ్ అన్నారు.