హ్యాండ్ బ్యాగ్‌లపై స్టాంపింగ్ కంటిన్యూ..
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు విమానాశ్రయాల్లో ప్రయాణికులు మోసుకెళ్లే బ్యాగ్‌లపై స్టాంపు వేయడం మానేయాలన్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు జరిగిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, కొచ్చి విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల బ్యాగులపై స్టాంపులు వేయకూడదని నిర్ణయించినట్లు బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) ఫిబ్రవరి 23నే ప్రకటించింది.
సీసీ కెమెరాలు అమర్చడంవంటి భద్రతా ఏర్పాట్లు ఇంకా పూర్తికానందున ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా విమానాశ్రయాల్లో భద్రత బాధ్యతలు చూసే సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) అప్పట్లోనే కోరింది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాలు సమావేశమయ్యారు. భద్రతా ఏర్పాట్లను త్వరగా పూర్తి చేసేందుకు బీసీఏఎస్, సీఐఎస్‌ఎఫ్, ఏడు విమానాశ్రయాల నిర్వాహకులతో కలిపి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే బ్యాగ్‌లపై స్టాంపులు వేయడాన్ని నిలిపివేస్తారని మంత్రులు తెలిపారు.