సాక్షి,న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిధులకు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసీ) బదులివ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ అంశానికి సంబంధించి ప్రజా ప్రాతినిథ్య చట్టం, కంపెనీల చట్ట సవరణలతో సహా తాజా నిబంధనల నేపథ్యంలో ఇవి ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేస్తాయని, అపరిమిత రాజకీయ విరాళాలకు ద్వారాలు తెరుస్తాయని పిటిషనర్ ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ పిటిషన్ దాఖలు చేసింది.
చట్ట సవరణలతో కంపెనీలు, సంస్థల నుంచి రాజకీయ విరాళాలపై పరిమితి తొలగిపోయిందని పేర్కొంది. ఏ రాజకీయ పార్టీల నిధులకైనా బ్యాంకులు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే వెసులుబాటు పార్టీలకు నిధుల ప్రవాహం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన విరాళాలను ఈసీకి వెల్లడించడాన్ని మినహాయిస్తూ ప్రజా ప్రాతినిథ్య చట్టానికి చేసిన సవరణలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నించేలా ఉన్నాయని, రాజకీయాల్లో అవినీతిని పెచ్చుమీరేలా చేస్తాయని పేర్కొంది.ఇక కంపెనీలు ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందీ వెల్లడించకుండా కంపెనీల చట్టానికి సవరణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment