సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ | syndicate bank cmd sk jain arrested by cbi | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్

Published Sun, Aug 3 2014 2:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ - Sakshi

సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్

ఎస్.కె. జైన్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
కోల్ స్కామ్ కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ. 50 లక్షలు డిమాండ్
మధ్యవర్తిని పంపి సొమ్ము తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఇంట్లోంచి రూ. 21 లక్షల నగదు, రూ. 1.68 కోట్ల బంగారం డిపాజిట్లు స్వాధీనం    

 
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) ఎస్.కె.జైన్ సహా ఆరుగురిని సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. సీబీఐ డెరైక్టర్ రంజిన్‌సిన్హా ఆదేశాల ప్రకారం జైన్ కార్యకలాపాలపై ఆరు నెలలుగా నిఘా ఉంచిన అధికారులు... బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల ప్రతినిధుల నుంచి జైన్ తరఫున లంచం తీసుకుంటున్న ఆయన బావమరిదిని, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్ట్ చేశారు. జైన్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అలాగే బెంగళూరు, భోపాల్, ఢిల్లీ, ముంబైలలోని 20 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జైన్ నివాసం నుంచి రూ.21 లక్షల నగదు, రూ.1.68 కోట్ల విలువైన బంగారం, రూ.63 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైన్‌తోపాటు మరో 11 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో ఇద్దరు పారిశ్రామికవేత్తలు నీరజ్ సింఘాల్ (భూషణ్ స్టీల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ), వేద్ ప్రకాశ్ అగర్వాల్ (ప్రకాశ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ)తో పాటు పవన్ బన్సాల్ (చార్టర్డ్ అకౌంటెంట్), వినీత్, పునీత్‌గోధా (జైన్ బంధువులు), విజయ్ పహుజా (సిమెంట్ వ్యాపారి), పురుషోత్తం టొట్లాని, పంకజ్ బన్సాల్‌లను నిందితులుగా పేర్కొన్నారు.http://img.sakshi.net/images/cms/2014-08/61407012670_Unknown.jpg



మరో ఇద్దరి పేర్లను వెల్లడించలేదు. జైన్ బావమరిది మధ్యవర్తిగా వ్యవహరించగా, చార్టర్డ్ అకౌంటెంట్ ఈ ఒప్పందం కుదిర్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. భూషణ్ స్టీల్ కంపెనీ పురుషోత్తం సేవలను వినియోగించుకుందని, నగదును వినీత్‌కు అందించినట్లు చెప్పాయి. వినీత్, పునీత్ గోధా, విజయ్ పహుజా (సిమెంట్ వ్యాపారి)లను భోపాల్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ అనుమతి పొందారు. వినీత్ గతంలో కాంగ్రెస్ మధ్యప్రదేశ్ విభాగానికి ప్రతినిధిగా పనిచేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా స్పందిస్తూ అవినీతిపై  పోరాడేందుకు కట్టుబడ్డామని, తాజా కేసు అందుకు ఉదాహరణ అని అన్నారు.

ఉన్నతాధికారులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి..

చెన్నై: జైన్ అరెస్ట్‌తో బ్యాకింగ్ రంగంలో ఉన్నతాధికారుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. బ్యాంకుల ఉన్నతాధికారులు అవినీతి కేసుల్లో పట్టుబడడం, కొందరు తప్పించుకుంటున్న తరుణంలో... ఈడీలు, సీఎండీలకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. ఇది తప్పనిసరి అని, బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు ఉన్నతాధికారుల ద్వారా జరుగుతున్నాయన్నారు. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోతున్నందున ఉన్నతాధికారులను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. తఈ ఘటన బ్యాంకింగ్ రంగానికి మచ్చ అన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement