debt limit
-
‘అప్పు’.. నాడు అపరిమితం.. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి..
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రుణ పరిమితికి మించి అప్పులు చేసింది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక ఏడాది వరకు పరిమితికి మించి ఏకంగా రూ.48,128.70 కోట్ల మేర రుణాలు తీసుకుంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో కేంద్రం అనుమతించిన పరిమితికన్నా రూ.2,696.76 కోట్లు తక్కువగా రుణం తీసుకుంది. -
రూ.20 వేల కోట్లకుపైగా రుణ పరిమితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా నిర్ధారించే రుణ పరిమితి లెక్కతేలింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) ప్రకారం రాష్ట్రాల ద్రవ్యలోటు జీఎస్డీపీలో మూడు శాతానికి మించకూడదు. అంటే జీఎస్డీపీలో గరిష్టంగా 3 శాతం మేరకు రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునే వీలుంటుంది. కొత్త జీఎస్డీపీ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.20 వేల కోట్లకు మించి రుణ పరిమితి ఖరారవనుంది. ఇటీవల రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన 2015-16 జీఎస్డీపీ నివేదికను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 5,83,117 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 11.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లుగా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి కూడా పెరగనుంది. మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని గత ఏడాదిగా రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. రెవెన్యూ మిగులుతో పాటు ద్రవ్య నిర్వహణలో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచేందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. అదే ప్రాతిపదికన తమకు వెసులుబాటు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత ఏడాది (2015-16) బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యలోటును 3.49 శాతంగా చూపించింది. రూ.16,969 కోట్ల రుణ సమీకరణకు అంచనాలు వేసుకుంది. కానీ రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా గరిష్ట రుణ పరిమితి మూడు శాతానికి లోబడే ఉండాలంటూ కేంద్ర ఆర్థికశాఖ సీలింగ్ విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. దీంతో వచ్చే బడ్జెట్లో ద్రవ్యలోటు నిర్ధేశించిన పరిమితికి కట్టుబడి ఉండాలా..? పెంపు కోరుతున్న మేరకు అంచనా వేసుకోవాలా..? అని రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బడ్జెట్ తయారీలో ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి కీలకమైన అంశం కావటంతో కొత్త జీఎస్డీపీ లెక్కలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీని ప్రకారం మూడు శాతం లెక్కిస్తే రూ.17,493 కోట్లు, మూడున్నర శాతం లెక్కగడితే రూ.20,409 కోట్లు రుణ పరిమితి ఖాయమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కావటంతో ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించిన స్థూల ఉత్పత్తిని 2016-17 సంవత్సరానికి అంచనా వేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితి రూ.20 వేల కోట్లు దాటడం ఖాయమైంది. సిద్ధమైన సీలింగ్ బడ్జెట్ బడ్జెట్ తయారీలో కీలకమైన శాఖలవారీ కేటాయింపుల ప్రక్రియ తుది దశకు చేరింది. సీఎం ఆదేశాల మేరకు గత నెల 16వ తేదీ వరకు అన్ని శాఖలు తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించాయి. వీటిని పరిశీలించిన సీఎం, ఏ శాఖకు ఎంత కేటాయించాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో శాఖలవారీగా కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రణాళిక పద్దులో ఆయా శాఖలకు ఇచ్చే అంచనా కేటాయింపులను(సీలింగ్ బడ్జెట్) సీల్డ్ కవర్లో చేరవేశారు. తమకు నిర్దేశించిన నిధుల్లో ఏయే పథకాలకు ఎంత అవసరం.. ఏయే పద్దుకు ఎంత కేటాయింపులుండాలి.. అని సంబంధిత శాఖలు ఆఖరి కసరత్తు చేయటమే మిగిలింది. వీటి ఆధారంగా బడ్జెట్లో పొందుపరచాల్సిన తుది కేటాయింపులు ఖరారవుతాయి. రెండు రోజుల వ్యవధిలో వీటిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. -
సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్
ఎస్.కె. జైన్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ కోల్ స్కామ్ కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ. 50 లక్షలు డిమాండ్ మధ్యవర్తిని పంపి సొమ్ము తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు ఇంట్లోంచి రూ. 21 లక్షల నగదు, రూ. 1.68 కోట్ల బంగారం డిపాజిట్లు స్వాధీనం న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) ఎస్.కె.జైన్ సహా ఆరుగురిని సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. సీబీఐ డెరైక్టర్ రంజిన్‌సిన్హా ఆదేశాల ప్రకారం జైన్ కార్యకలాపాలపై ఆరు నెలలుగా నిఘా ఉంచిన అధికారులు... బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల ప్రతినిధుల నుంచి జైన్ తరఫున లంచం తీసుకుంటున్న ఆయన బావమరిదిని, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్ట్ చేశారు. జైన్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అలాగే బెంగళూరు, భోపాల్, ఢిల్లీ, ముంబైలలోని 20 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జైన్ నివాసం నుంచి రూ.21 లక్షల నగదు, రూ.1.68 కోట్ల విలువైన బంగారం, రూ.63 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైన్‌తోపాటు మరో 11 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో ఇద్దరు పారిశ్రామికవేత్తలు నీరజ్ సింఘాల్ (భూషణ్ స్టీల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ), వేద్ ప్రకాశ్ అగర్వాల్ (ప్రకాశ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ)తో పాటు పవన్ బన్సాల్ (చార్టర్డ్ అకౌంటెంట్), వినీత్, పునీత్‌గోధా (జైన్ బంధువులు), విజయ్ పహుజా (సిమెంట్ వ్యాపారి), పురుషోత్తం టొట్లాని, పంకజ్ బన్సాల్లను నిందితులుగా పేర్కొన్నారు. మరో ఇద్దరి పేర్లను వెల్లడించలేదు. జైన్ బావమరిది మధ్యవర్తిగా వ్యవహరించగా, చార్టర్డ్ అకౌంటెంట్ ఈ ఒప్పందం కుదిర్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. భూషణ్ స్టీల్ కంపెనీ పురుషోత్తం సేవలను వినియోగించుకుందని, నగదును వినీత్‌కు అందించినట్లు చెప్పాయి. వినీత్, పునీత్ గోధా, విజయ్ పహుజా (సిమెంట్ వ్యాపారి)లను భోపాల్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ అనుమతి పొందారు. వినీత్ గతంలో కాంగ్రెస్ మధ్యప్రదేశ్ విభాగానికి ప్రతినిధిగా పనిచేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా స్పందిస్తూ అవినీతిపై పోరాడేందుకు కట్టుబడ్డామని, తాజా కేసు అందుకు ఉదాహరణ అని అన్నారు. ఉన్నతాధికారులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి.. చెన్నై: జైన్ అరెస్ట్‌తో బ్యాకింగ్ రంగంలో ఉన్నతాధికారుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. బ్యాంకుల ఉన్నతాధికారులు అవినీతి కేసుల్లో పట్టుబడడం, కొందరు తప్పించుకుంటున్న తరుణంలో... ఈడీలు, సీఎండీలకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. ఇది తప్పనిసరి అని, బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు ఉన్నతాధికారుల ద్వారా జరుగుతున్నాయన్నారు. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోతున్నందున ఉన్నతాధికారులను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. తఈ ఘటన బ్యాంకింగ్ రంగానికి మచ్చ అన్నారు. -
‘ఎఫ్ఆర్బీఎం’ సవరణలకు కేంద్రం ఒకే
అప్పుల పరిమితి పెంచుకోవచ్చు జీఎస్డీపీలో ఒక శాతం పెంచితే రూ.4,500 కోట్లు అప్పు హైదరాబాద్: ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల పరిమితి పెంచుకోవడానికి వీలుకలిగే వెసులుబాటును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం నిబంధనలను సడలించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ) ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు మూడు శాతానికి మించకూడదు. అయితే రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలను అధిగమించింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లపైన ప్రభావం చూపుతుంది. అలాగే నిబంధనలను సడలిస్తేగాని అప్పులు ఎక్కువగా తెచ్చుకోవడానికి వీలుండదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వెసులబాటుకు ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను సడలించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆర్థిక వెసులుబాటుకు ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. -
రుణ పరిమితి పెంపు
అద్దంకి, న్యూస్‌లైన్ : ప్రాథమిక సహకార సంఘా లకు రుణ పరిమితిని పెంచినట్లు ఆ సంఘ జిల్లా చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. ఆ మేరకు ఈ నెల 7వ తేదీ ప్రభుత్వం జీవో జారీచేసినట్లు వెల్లడించారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘం ద్వారా నాయీబ్రాహ్మణ, రజక, వడ్డెర, సఘర, వల్మికి, కృష్ణబలిజ, బట్టరాజు, మేదర, కుమ్మరి సహకార సంఘాలకు ఒక్కో సంఘానికి గతంలో 1.50 లక్షల రూపాయల రుణాన్ని మాత్రమే ప్రభుత్వం అందజేసేదని చెప్పారు. సహకార సంఘ నాయకుల అభ్యర్థన మేరకు రుణ పరిమితిని పెంచుతూ మంత్రి బసవరాజు సారయ్య జీవో జారీ చేశారని వివరించారు. దాని ప్రకారం 15 మంది సభ్యులున్న ఒక్కో సంఘం 7.50 లక్షల రూపాయల రుణం పొందే అవకాశం ఉందన్నారు. దానిలో 3.75 లక్షలు రాయితీ పోగా, మిగిలిన 3.75 లక్షల రూపాయలు బ్యాంక్లోన్గా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సహకార సంఘాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి సూచించారు. ఆయన వెంట సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్లగడ్డ వీరసుందరాచారి, సొసైటీ అధ్యక్షుడు బీ వీరప్పాచారి, గుండిమెడ వెంకటేశ్వరరావు, చండ్రపాటి చిరంజీవి, ముత్తులూరి హరిబాబు, ఒండముది రమేష్, అడుగుల కృష్ణ, అద్దంకి రమేష్, కుందుర్తి సురేష్ ఉన్నారు.