సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా నిర్ధారించే రుణ పరిమితి లెక్కతేలింది. ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) ప్రకారం రాష్ట్రాల ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో మూడు శాతానికి మించకూడదు. అంటే జీఎస్‌డీపీలో గరిష్టంగా 3 శాతం మేరకు రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునే వీలుంటుంది. కొత్త జీఎస్‌డీపీ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.20 వేల కోట్లకు మించి రుణ పరిమితి ఖరారవనుంది.
ఇటీవల రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన 2015-16 జీఎస్‌డీపీ నివేదికను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 5,83,117 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 11.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లుగా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి కూడా పెరగనుంది. మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని గత ఏడాదిగా రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. రెవెన్యూ మిగులుతో పాటు ద్రవ్య నిర్వహణలో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచేందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
అదే ప్రాతిపదికన తమకు వెసులుబాటు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత ఏడాది (2015-16) బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యలోటును 3.49 శాతంగా చూపించింది. రూ.16,969 కోట్ల రుణ సమీకరణకు అంచనాలు వేసుకుంది. కానీ రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా గరిష్ట రుణ పరిమితి మూడు శాతానికి లోబడే ఉండాలంటూ కేంద్ర ఆర్థికశాఖ సీలింగ్ విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. దీంతో వచ్చే బడ్జెట్‌లో ద్రవ్యలోటు నిర్ధేశించిన పరిమితికి కట్టుబడి ఉండాలా..? పెంపు కోరుతున్న మేరకు అంచనా వేసుకోవాలా..? అని రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బడ్జెట్ తయారీలో ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి కీలకమైన అంశం కావటంతో కొత్త జీఎస్‌డీపీ లెక్కలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీని ప్రకారం మూడు శాతం లెక్కిస్తే రూ.17,493 కోట్లు, మూడున్నర శాతం లెక్కగడితే రూ.20,409 కోట్లు రుణ పరిమితి ఖాయమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కావటంతో ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించిన స్థూల ఉత్పత్తిని 2016-17 సంవత్సరానికి అంచనా వేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి రూ.20 వేల కోట్లు దాటడం ఖాయమైంది.
సిద్ధమైన సీలింగ్ బడ్జెట్
బడ్జెట్ తయారీలో కీలకమైన శాఖలవారీ కేటాయింపుల ప్రక్రియ తుది దశకు చేరింది. సీఎం ఆదేశాల మేరకు గత నెల 16వ తేదీ వరకు అన్ని శాఖలు తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించాయి. వీటిని పరిశీలించిన సీఎం, ఏ శాఖకు ఎంత కేటాయించాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో శాఖలవారీగా కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రణాళిక పద్దులో ఆయా శాఖలకు ఇచ్చే అంచనా కేటాయింపులను(సీలింగ్ బడ్జెట్) సీల్డ్ కవర్‌లో చేరవేశారు. తమకు నిర్దేశించిన నిధుల్లో ఏయే పథకాలకు ఎంత అవసరం.. ఏయే పద్దుకు ఎంత కేటాయింపులుండాలి.. అని సంబంధిత శాఖలు ఆఖరి కసరత్తు చేయటమే మిగిలింది. వీటి ఆధారంగా బడ్జెట్‌లో పొందుపరచాల్సిన తుది కేటాయింపులు ఖరారవుతాయి. రెండు రోజుల వ్యవధిలో వీటిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
రూ.20 వేల కోట్లకుపైగా రుణ పరిమితి
Published Thu, Mar 3 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement