అప్పుల పరిమితి పెంచుకోవచ్చు
జీఎస్‌డీపీలో ఒక శాతం పెంచితే రూ.4,500 కోట్లు అప్పు
హైదరాబాద్: ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల పరిమితి పెంచుకోవడానికి వీలుకలిగే వెసులుబాటును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలను సడలించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు మూడు శాతానికి మించకూడదు. అయితే రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను అధిగమించింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లపైన ప్రభావం చూపుతుంది.
అలాగే నిబంధనలను సడలిస్తేగాని అప్పులు ఎక్కువగా తెచ్చుకోవడానికి వీలుండదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వెసులబాటుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలను సడలించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆర్థిక వెసులుబాటుకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
‘ఎఫ్‌ఆర్‌బీఎం’ సవరణలకు కేంద్రం ఒకే
Published Sun, Jun 29 2014 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement