అద్దంకి, న్యూస్‌లైన్ : ప్రాథమిక సహకార సంఘా లకు రుణ పరిమితిని పెంచినట్లు ఆ సంఘ జిల్లా చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. ఆ మేరకు ఈ నెల 7వ తేదీ ప్రభుత్వం జీవో జారీచేసినట్లు వెల్లడించారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘం ద్వారా నాయీబ్రాహ్మణ, రజక, వడ్డెర, సఘర, వల్మికి, కృష్ణబలిజ, బట్టరాజు, మేదర, కుమ్మరి సహకార సంఘాలకు ఒక్కో సంఘానికి గతంలో 1.50 లక్షల రూపాయల రుణాన్ని మాత్రమే ప్రభుత్వం అందజేసేదని చెప్పారు. సహకార సంఘ నాయకుల అభ్యర్థన మేరకు రుణ పరిమితిని పెంచుతూ మంత్రి బసవరాజు సారయ్య జీవో జారీ చేశారని వివరించారు.
దాని ప్రకారం 15 మంది సభ్యులున్న ఒక్కో సంఘం 7.50 లక్షల రూపాయల రుణం పొందే అవకాశం ఉందన్నారు. దానిలో 3.75 లక్షలు రాయితీ పోగా, మిగిలిన 3.75 లక్షల రూపాయలు బ్యాంక్‌లోన్‌గా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సహకార సంఘాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి సూచించారు. ఆయన వెంట సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్లగడ్డ వీరసుందరాచారి, సొసైటీ అధ్యక్షుడు బీ వీరప్పాచారి, గుండిమెడ వెంకటేశ్వరరావు, చండ్రపాటి చిరంజీవి, ముత్తులూరి హరిబాబు, ఒండముది రమేష్, అడుగుల కృష్ణ, అద్దంకి రమేష్, కుందుర్తి సురేష్ ఉన్నారు.
రుణ పరిమితి పెంపు
Published Fri, Jan 10 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement