మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్‌లు, కాల్పులతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సీనియర్ భద్రతా అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.
ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కిఉన్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా నగ్రోటాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేసి తనిఖీలు ముమ్మరం చేశారు.
మరోఘటనలో సాంబా జిల‍్లాలోని రామ్‌ఘర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ జవాన్ సైతం గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.