సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవలి కాలంలో పార్లమెంటు సమావేశాలన్నీ పలు అంశాలపై ఆందోళనలు, గందరగోళాల మధ్య ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఈసారైనా సజావుగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అత్యంత కీలకమైన ఆహార భద్రత బిల్లుకు ఆమోదం వంటి అంశాలతో భారీ ఎజెండా సమావేశాలు ముందుండగా.. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ అంశంతో పాటు.. కొన్ని ఇతర రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ప్రభావం కూడా ఈ సమావేశాలపై పడనుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న తీరును, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో ఈ నిర్ణయం రాజేసిన ఆగ్రహజ్వాలలను ఉభయ సభల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టబోతోంది. అలాగే త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు.
ఎఫ్‌డీఐ పెంపును వ్యతిరేకిస్తున్న బీజేపీ...
బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం శనివారం నాడే విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని వారు సంకేతాలిచ్చారు. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని ఆదివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. రూపాయి విలువ పతనం, ధరల పెరుగుదల, ఆర్ధికాభివృద్ధి మందగించటం నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని సుష్మా డిమాండ్ చేశారు. ఇందుకు సర్కారు సమ్మతించింది.