అమరుల కుటుంబాలకు ఇకపై రూ.25 లక్షల పరిహారం
నోయిడా: సరిహద్దులో 9 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వహించే రక్షక దళాల సేవలు గుర్తిస్తూ ఇకపై ‘హై ఆల్టిట్యూడ్ మెడల్’ ఇవ్వాలని నిర్ణయించినట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 55వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద దాడి లాంటి సందర్భాల్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచినట్లు హోంమంత్రి పేర్కొన్నారు.