'మీ మొసలి కన్నీళ్లు మాకవసరం లేదు'
న్యూఢిల్లీ : నిర్భయ డాక్యుమెంటరీ ఉదంతంపై బుధవారం రాజ్యసభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై చర్చ చేపట్టిన సభ.. నిర్భయ కేసులో దోషి ముఖేష్ కుమార్ను ఇంటర్వ్యూ చేయటాన్ని తీవ్రంగా ఖండించింది. దోషిగా ఉన్న అతడితో ఇంటర్వ్యూ కు అనుమతిచ్చిన జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ సూచించారు.
మరోవైపు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కూడా ఈ ఇంటర్వ్యునూ ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సభకు తెలిపారు. ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇస్తూ ... ఇది చాలా తీవ్రమైన విషయమని, వ్యక్తిగతంగా కూడా తనను ఈ సంఘటన తనను ఎంతో బాధించిందన్నారు. డాక్యుమెంటరీ తీసిన వ్యక్తికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.
కాగా ఇదే విషయంపై రాజ్యసభలోని మహిళా సభ్యులంతా ధ్వజమెత్తారు. ఎంపీ, బాలీవుడ్ నటిజయాబచ్చన్ మాట్లాడుతూ, అసలు దోషికి మరణ శిక్ష ఎందుకు విధించలేదో చెప్పాలన్నారు. మొసలి కన్నీళ్లు తమకు అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తూ సభను వాకౌట్ చేశారు. నిర్మలా సీతారామన్, మాయావతి, అంబికాసోనీ తదితరులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనతో సభ కాసేపు వాయిదా పడింది. మరోవైపు ముకేష్ ఇంటర్వ్యూ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఇంటర్వ్యూ దృశ్యాల ప్రసారంపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారి చేసింది.