నాలుగు రోజులపాటు సాగిన న్యాయపోరాటం ఆదివారం ముగిసింది. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనలో చనిపోయిన 16 ఏళ్ల బాలిక అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబం అంగీకరించింది. దీంతో మోగా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచిన బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని స్వీకరించేందుకు కూడా బాలిక కుటుంబం అంగీకరించింది. ఆసుపత్రి ఆవరణలోనే మృతురాలి తండ్రికి రూ. 30 లక్షల నగదు అందించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోరాటం విరమణ, నష్టపరిహారం స్వీకరించడం వెనుక ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని మృతురాలి తండ్రి మీడియాతో అన్నారు.