moga incident
-
పార్లమెంట్ ను కుదిపేసిన 'మోగా' ఘటన
న్యూఢిల్లీ: మోగా ఘటనపై మంగళవారం పార్లమెంట్ అట్టుడికింది. దీనిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. పంజాబ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అంబికా సోని డిమాండ్ చేశారు. ఇది చాలా సీరియస్ విషయమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల బస్సులో కీచక పర్వం జరిగితే నిందితులను మాత్రమే అదుపులోకి తీసుకుని, బస్సు యాజనులను వదిలేశారని తెలిపారు. అటు లోక్ సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో కదులుతున్న బస్సులో తల్లీబిడ్డలపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై వారిని కిందకు తోసేశారు. ఈ ఘటనలో 16 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మోగాలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. -
మోగా ఘటన: బాలిక అంత్యక్రియలకు కుటుంబం అంగీకారం
నాలుగు రోజులపాటు సాగిన న్యాయపోరాటం ఆదివారం ముగిసింది. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనలో చనిపోయిన 16 ఏళ్ల బాలిక అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబం అంగీకరించింది. దీంతో మోగా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచిన బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని స్వీకరించేందుకు కూడా బాలిక కుటుంబం అంగీకరించింది. ఆసుపత్రి ఆవరణలోనే మృతురాలి తండ్రికి రూ. 30 లక్షల నగదు అందించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోరాటం విరమణ, నష్టపరిహారం స్వీకరించడం వెనుక ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని మృతురాలి తండ్రి మీడియాతో అన్నారు. -
మృతురాలి కుటుంబాన్ని కలవనున్న సీఎం
కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఎట్టకేలకు స్పందించారు. మోగా జిల్లా నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన సహించరానిదని, 16 ఏళ్ల బాలిక మరణం అత్యంత బాధాకరమన్నారు. మోగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబాన్ని స్వంయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. అకాలీదళ్ మాజీ మంత్రి అజైబ్ సింగ్ మాతృమూర్తికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆదివారం పటియాలాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తమ కుటుంబానికి చెందిన 'ఆర్బిట్ ఏవియేషన్' రవాణా సంస్థ అనుమతుల రద్దుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఆసుపత్రివద్ద బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వ్యతికేర నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రోజులుగా మోగా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్న బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఆమె తండ్రి అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. కానీ పోలీసులు తమను ఒత్తిడి చేస్తున్నారని, రాజీ కుదుర్చుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. బస్సు యజమానుదారుడైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కేసు నమోదుచేసి, ఆయనకు చెందిన ‘ఆర్బిట్ ఏవియేషన్’ సంస్థ రవాణా అనుమతులను రద్దు చేసేవరకు తమ పట్టు వీడబోమంటున్నారు.