పార్లమెంట్ ను కుదిపేసిన 'మోగా' ఘటన
న్యూఢిల్లీ: మోగా ఘటనపై మంగళవారం పార్లమెంట్ అట్టుడికింది. దీనిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు.
పంజాబ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అంబికా సోని డిమాండ్ చేశారు. ఇది చాలా సీరియస్ విషయమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల బస్సులో కీచక పర్వం జరిగితే నిందితులను మాత్రమే అదుపులోకి తీసుకుని, బస్సు యాజనులను వదిలేశారని తెలిపారు. అటు లోక్ సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
పంజాబ్‌లోని మోగా జిల్లాలో కదులుతున్న బస్సులో తల్లీబిడ్డలపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై వారిని కిందకు తోసేశారు. ఈ ఘటనలో 16 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మోగాలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.