గోవధ నిషేధ చట్టం నిప్పుతో చెలగాటమే...! | cow slaughter act is dangerous one | Sakshi
Sakshi News home page

గోవధ నిషేధ చట్టం నిప్పుతో చెలగాటమే...!

Published Sun, Oct 18 2015 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గోవధ నిషేధ చట్టం నిప్పుతో చెలగాటమే...! - Sakshi

గోవధ నిషేధ చట్టం నిప్పుతో చెలగాటమే...!

అవలోకనం
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇండియాలో కాస్త మార్పు చోటుచేసుకుంటోందని పాశ్చాత్యులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక కారణంతో మనుషులను చిత్రవధ చేసి చంపడమనేది వారికి కూడా ఏమంత కొత్త విషయం కాదు. అయితే ఇండియాలో పరిణామాలు మరింత ఘోరంగా తయారవుతున్నాయనే అభిప్రాయం బలవడుతోంది. ఈ కోణంలోనే మోదీ ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇక్కడే తాను జోక్యం చేసుకోవలసిన అవసరముందని ఆయన గ్రహించాలి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే తన అభివృద్ధి ఎజెండాకు, ఇండియా ప్రతిష్టకు అవి సహకరిస్తాయా అని ఆయన తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం కావచ్చు.
 
దాదాపు 60 ఏళ్ల కాలంలో అంటే 1927 నుంచి 1986 వరకు ఒకప్పటి అఖండ భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ దైవదూషణ కేసులు కేవలం ఏడు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత గడచిన 30 ఏళ్ల కాలంలో ఒక్క పాకిస్తాన్‌లోనే వెయ్యి దైవదూషణ కేసులు నమోదయ్యాయి. ఎందుకు? ఈ విషయాన్ని మనం తర్వాత పరిశీలిద్దాం. ఇప్పుడు మాత్రం కాస్త విభిన్నంగా ఉండే మరో అంశాన్ని చూద్దాం. కొద్ది రోజులుగా దేశంలోని రచయితలు, కళాకారులు తమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్న ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎలా వ్యవహరించి ఉండాలి?
 
కళాకారుల తీవ్రస్పందనకు దారితీసిన ఆ ఘటనపై (గోమాంసం ఆరగించాడన్న సాకుతో ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యక్తిని వధించడం) ప్రధాని ఇప్పటికే స్పందించడమే కాకుండా ఆ ఘటన విషాదకరమైనదని, దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు కూడా. అయితే రచయితలు, కళాకారుల తిరుగుబాటుపై ఇంతవరకు ఆయన నిర్లక్ష్యం వహిస్తూవచ్చారు. ప్రధాని పాటించిన ఈ మౌనమే అహేతుకమని చెప్పవచ్చు. అయితే దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటనపై ప్రధాని స్పందించవలసిన అవసరం లేదంటే నేను అంగీకరిస్తాను.
 
మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ హయాంలోనూ ఇలాగే హింసాత్మక ఘటనలు సంభవించినప్పుడు గతంలో ఇదే రచయితలు, కళాకారులు స్పందించ లేదని, వారు కపట వైఖరితో వ్యవహరిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. మూడో విషయం ఏమిటంటే వీరు తమ అవార్డులను ప్రభుత్వం నుంచి కాకుండా సాహిత్య అకాడమీ నుంచీ గ్రహించారు. ప్రభుత్వ భావజాలానికి అతీతంగా అకాడమీ స్వతంత్రత కలిగి ఉంటుందని చాలామంది భావన. ఈ సందర్భంలో వీరి అసమ్మతి ప్రభుత్వం మీద కాకుండా అకాడమీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడుతోంది. వాస్తవానికి కళాకారుల లక్ష్యం అకాడమీ కాదు.
 
నా ఉద్దేశంలో, అవార్డులను వెనక్కి ఇచ్చేయడమన్న వైఖరి నాటకీయతకు సంబంధించినది. ఇది ఆలోచనా పూర్వకమైన వైఖరి. భారతీయ రచయితకు అసమ్మతిని వ్యక్తం చేయడానికి అందుబాటులో ఉన్న సాధనాలు తక్కువే. సాహిత్యం, చిత్రలేఖనం అనేవి శక్తివంతమైన భావవ్యక్తీకరణ సాధనాలు. కానీ అవి సమాజంపై తక్షణ ప్రభావం కలిగించలేవు. లిఖితపూర్వక విధానంలోనే చదవగలుగుతున్న, తమ సమాచారంలో అధిక భాగాన్ని పొందుతున్న సమా జాలు, సంస్కృతుల్లోనే రచయితలు అసమ్మతి రచనలు చేస్తుంటారు.
 
సమాజం ఎలా ఉంటోంది, అదెలా ఉండాలన్న అంశంపై తమ ఆలోచనలను తమ నవలల ద్వారానే జాతికి తాము చెబుతూ వచ్చామని 19వ శతాబ్ది రష్యన్ రచయితలు చెప్పారు. కానీ ఇండియా అలాంటి స్థానంలో లేదు. ఇకపై కూడా అలాంటి స్థానంలో ఇండియా ఉండబోదని టీవీలు, వీడియోలు నిర్ధారించేశాయి.
 ఇండియా అలాంటి స్థానంలో ఉన్నట్లయితే, తమ అధ్యయనాలను కట్టిపెట్టి నిరసనతోనూ, లోతైన అర్థంతో కూడిన రచనలు చేస్తున్న రచయితలు మనకు ఉండేవారు. దీనికి బదులుగా, వారు (మహా అయితే 20 మంది లేక అంత కంటే ఎక్కువ మంది) ప్రభుత్వ క్రియ లేదా నిష్క్రియతో తాము సంతుష్టి చెందడం లేదనీ, అందుకే సమాజం తమకు కల్పించిన గౌరవాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ అంశమే ఇక్కడ కీలకమైనది.
 
 సమాజంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల రచయితలు నిరసన తెలుపుతున్నారు. సమాజంలో జరుగుతున్న దానిని గమనిస్తూ, కలవరపాటుకు గురవుతున్నామనే విషయాన్ని వారు తమ నిరసన ద్వారా వ్యక్తీకరిస్తున్నారు. వీరిలో కొంతమంది రచయితలు భారతీయ జనతాపార్టీపై, దాని భావజాలంపై అయిష్టత ప్రకటిస్తున్నారన్న విషయాన్ని మనం ఆంగీకరించవచ్చు కానీ, వారికే కాకుండా, మనలో కూడా పలువురికి ప్రస్తుతం ఇండియాలో నెలకొంటున్న వాతావరణం పట్ల ఎంతో అసౌకర్యం కలుగుతోంది.
ఈ పరిస్థితుల్లో రచయితలు, కళాకారుల చర్యలు కేవలం స్టంట్ మాత్రమేనని, అవి రాజకీయ ప్రయోజనంతో ముడిపడి ఉన్నాయని భావించడం కష్టమే అవుతుంది. విషయాన్ని ఇలాగే మనం అర్థం చేసుకున్నట్లయితే, హిందుత్వ మద్దతుదారులను కట్టడి చేయాలంటూ రచయితలు అంతర్లీనంగా చేస్తున్న డిమాండుకు సంబంధించి మోదీపైనే అధిక ఒత్తిడి ఉంటుంది. ఇదే ఇప్పుడు కాస్త తీవ్రమైన సమస్యగా మారింది.
 
ఈ విషయంలో మోదీకి కాస్త అనుకూలమైన విషయం ఏమిటంటే, రచయితలు అవార్డులను వెనక్కు ఇచ్చేయడం ప్రచారయావ మాత్రమేననీ, యూరప్‌లో లేదా ప్రపంచంలోని మరిన్ని నాగరిక ప్రాంతాలకు మల్లే ఇది అంత ఏకపక్ష వ్యవహారంగా లేదని దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతుడైన టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి లాగే మీడియాలో చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతానికయితే, మోదీ మౌనం కారణంగా బాహ్య ప్రపంచంలో ఇండియాకు కొంత నష్టం జరిగింది. లండన్‌లో బీబీసీ నిర్వాహకులు ఈ విష యమై కొద్ది రోజుల క్రితం నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇండియాలో కాస్త మార్పు చోటు చేసుకుం టోందని వారు అభిప్రాయపడుతున్నారు.
 
అయితే వారి భావన అంత అర్థవంతమైనదని నేననుకోవడం లేదు, ఏదో కారణంతో మనుషులను చిత్రవధ చేసి చంపడం అనేది వారికి కూడా ఏమంత కొత్త విషయం కాదు. అయితే ఇండియాలో పరిణామాలు మరింత ఘోరంగా తయారవుతున్నాయనే అభిప్రాయం వారిలో బలవడుతోంది. ఈ కోణంలోనే మోదీ ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇక్కడే తాను జోక్యం చేసుకోవలసిన అవసరముంది.
 
అయితే మోదీ శైలిలో మనం అర్థం చేసుకోవలసిన అంశం ఒకటుంది. హింసాత్మక ఘటనల్లో హిందుత్వశక్తుల పాత్ర ఉన్న సందర్భాలపై వ్యాఖ్యానిం చవలసిన సమయాల్లో మోదీ మౌనం పాటిస్తున్నారు. దశాబ్దంపాటు తాను అధికారం చెలాయించిన గుజరాత్‌లో ఇలాంటి ఘటనలపై ఆయన పరమ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. భారత్‌లో కొనసాగుతున్న అన్ని కథనాలకు మల్లే, ఇది కూడా కొన్నాళ్లకు ముగిసిపోవచ్చు. మోదీ కూడా ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై ఇలాంటి అంచనాతోనే ఉండవచ్చు.
 ఈ వాస్తవానికి సంబంధించి మనం మళ్లీ వెనక్కు వెళదాం. పాకిస్తాన్‌లో చోటు చేసుకున్న మార్పు ఏమిటంటే, 1986లో దైవదూషణను మరణ శిక్ష విధించదగ్గ నేరంగా సూత్రీకరించారు. ఇది సమాజంలో మార్పును తీసుకువచ్చి ప్రజలను ఏ మాత్రం సహనభావం లేనివారిలాగా మలచింది. దీంతో ఉన్నట్లుండి పాక్‌లో దైవదూషణ కేసులు అమాంతంగా పెరిగాయి.
 
బీజేపీ నేతృత్వంలోని ఇండియా గోవధ నిషేధ చట్టం ద్వారా నిప్పుతో చెల గాటమాడుతోంది. దీని ఫలితంగా సమాజంలో చోటుచేసుకుంటున్న హింసను మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా పాకిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలే ఇక్కడా కనిపిస్తున్నాయి. రచయితలు, కళాకారుల సమస్యను మోదీ పరిష్కరించినా, పరిష్కరించలేకపోయినా, హిందుత్వ శక్తుల విస్తృత స్థాయి సాంస్కృతిక దాహం కేసి ఆయన తప్పక దృష్టి సారించవలసి రావచ్చు. తన అభివృద్ధి ఎజెండాకు, ఇండియా ప్రతిష్టకు ఇది సహకరిస్తుందా అని ఆయన అంచనా వేసుకునే సమయం ఆసన్నం కావచ్చు.

ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement