అస్తిత్వ జెండాకు ‘జన’ వందనం
తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించినట్టు అవుతుంది. భూసంస్కరణలను అమలు జరపాలని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జనగామను సీఎం గుండెల్లో దాచుకుని, జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్ష.
తెలంగాణలో జనగామ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. ఈ ప్రాంతానికి ఒక్క పోరాట చరిత్రే కాదు, గొప్ప సాంస్కృ తిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి ప్రజలు పెద్దగా ధన వంతులు కాకపోవచ్చు. కానీ వివేకవంతులు. వస్తువు, భాష, ఛందస్సులలో నవ్య త్వాన్ని చాటి, ఉత్పత్తి కులాలకు సాహిత్యంలో స్థానం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడి వారే. ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ ఆయన స్మర ణీయ కృతులు. ఇవాళ తెలంగాణ ఆయనను తొలి కవిగా ఆదరిస్తున్నది. ఆయన చేపట్టిన ప్రక్రియలు సాహితీరంగాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి.
ధన, కనక, వస్తువాహనాలకు ఆశించకుండా తను రాసిన భాగవతాన్ని నరాంకితం చేయకుండా, నారా యణునికి అంకితం చేసిన పోతనామాత్యుడు జన్మించిన బమ్మెర ఇక్కడిదే. వీరికి స్ఫూర్తిగా నిలిచారా అన్నట్టు పాలకుర్తిలోని గుట్ట మీద రెండు గుహల్లో శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వాములు స్వయంభువులుగా వెలసి అనాదిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. వాల్మీకి క్షేత్రంగా భావించే ‘వల్మికి’ ఈ ప్రాంతంలోనిదే. ఒకే పాదులో మొలిచినట్టుగా శైవ, వైష్ణవాలు; అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా సోమన, పోతన నిలవడం కాల ప్రభావమే. ఈ మహా కవుల సాంస్కృతిక ప్రభావమే, వారసత్వమే చుక్క సత్తయ్య వంటి ఒగ్గు కథ కళాకారులకు స్ఫూర్తినిచ్చిందనుకుంటాను. అంపశయ్య నవీన్ వంటి అభ్యుదయ రచయిత, సి. రాఘవాచారి వంటి పాత్రికేయులు ఈ మట్టి కన్నబిడ్డలే.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనను వికేంద్రీక రించవచ్చు గాని, ప్రజా సంస్కృతినీ, చరిత్రనూ వికేంద్రీ కరించలేము. అక్కడి భౌగోళిక పరిస్థితులు వారి మధ్య సంబంధాలను సమన్వయం చేస్తాయి. సామాజిక నేప థ్యానికీ, సంస్కృతికీ సమన్వయం కుదిరినప్పుడే సంబం ధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి. రెండూ వేర యితే సంఘర్షణాత్మక ధోరణే మిగులుతుంది. అది శాంతికి భంగకరమూ కావచ్చు. దేవులపల్లి వెంక టేశ్వరరావు వంటి కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ‘జనగామ ప్రజల వీరోచిత పోరా టాన్ని’ గురించి ప్రత్యేక గ్రంథమే వెలువరించారు.
జనగామ ప్రాంతమంటే చాకలి ఐలమ్మ బువ్వ గింజల పోరాటం గుర్తుకు వస్తుంది. ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి దొరతనాన్ని ఎదిరించి అమరుడైన బందగీ భూమి పోరాటం తలపునకొస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పి నేలకొరిగిన దొడ్డి కొమరయ్య వంటి వీరుల అమరత్వం కళ్ల ముందు కదలాడుతుంది. జనగామ ప్రాంతం చేసిన పోరాటం వల్లనే దున్నేవానికే భూమి అన్న నినాదం ఎగిసిపడింది. అది భారతదేశంలో జరిగిన పోరాటాలకు కేంద్ర బిందువయింది. భారతదేశంలో భూసంస్కర ణలు రావడానికి జనగామ భూపోరాటమే కారణం.
పాలనా సౌలభ్యానికీ, ప్రజావసరాలు తీర్చడానికీ, పాలనా యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి రావ డానికీ జిల్లాల వ్యవస్థ ఏర్పాటైంది. నిజాం పాలనలో జమాబందీతో పాటు జిల్లా బందీని ఏర్పాటు చేసి పాలించారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణను 24 జిల్లాలను చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనను తెలంగాణ సమాజం ఆహ్వానిస్తున్నది. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలకు భిన్నంగా కేసీఆర్ ప్రతి అంశంలోను నూతన ఒరవడితో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ తెలంగాణ సమా జానికి అవసరమైనవే. ఆ ఫలితాలన్నీ భవిష్యత్ సమా జం అనుభవించడం ఖాయం. తెలంగాణ రాష్ట్రం ఉద్య మాల ద్వారా వచ్చింది.
రాజకీయ ప్రక్రియను చేపట్టిన కేసీఆర్ పట్టు వదలకుండా పోరాడి తెలంగాణ విష యంలో గెలిచారు. అందుకే జిల్లాల వ్యవస్థలో మార్పులు చేసే సమయంలో ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బ్యూరోక్రసీకి ఈ నిర్ణయాన్ని వదిలిపెడితే గూగుల్ నెట్ వర్క్ పెట్టుకుని భూమ్మీద గీతలు గీసి 24 జిల్లాల స్వరూపాన్ని తేల్చేస్తారు. ఒక జిల్లాను ఏర్పాటు చేసే టప్పుడు ఆ నేలకు ఉన్న స్వభావాన్ని, ప్రజా పోరాటాల సామ్యాన్ని, సామాజిక, సాంఘిక నేపథ్యాలని, సంస్కృ తిని దృష్టిలో పెట్టుకుంటే ప్రాంతాల మధ్య స్థానికతను నిలబెట్టినట్టవుతుంది. బ్యూరోక్రసీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేసే కాలం పోయిందని తెలంగాణ ప్రభు త్వమే ఆచరణాత్మకంగా చెబుతోంది. ప్రతి 40 కిలో మీటర్లకు భాష మారుతుంది. అలాగే భౌగోళికంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దేశంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించి నట్టు అవుతుంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో వంటా వార్పునకు, బతుకమ్మ బోనాల పండుగల రూపాలను ప్రతిష్టించి ఉద్యమాన్ని రగిలించారు.
ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం వల్ల భూసంస్కరణలను అమలు జరపండని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జన గామ నేలను కూడా ముఖ్యమంత్రి గుండెల్లో దాచుకుని, తాము కోరుకుంటున్నట్టుగా జిల్లాను ఏర్పాటు చేయా లని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని నమ్మకం నాకు ఉంది. ఒకనాడు భూమి పోరు జెండాను పట్టుకున్న పోరు భూమి నేడు తన అస్తిత్వం కాపాడుకోవడానికి తనను ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించమని వేడుకుంటున్నది.
- చుక్కా రామయ్య
- వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు