ఐదు ఎత్తులు కుదిరితేనే కమళం విరబూసేది..! | BJP Will Focus Mainly Five States To Get Into Power | Sakshi
Sakshi News home page

ఐదు ఎత్తులు కుదిరితేనే కమళం విరబూసేది..!

Published Sun, Mar 17 2019 2:07 PM | Last Updated on Sun, Mar 17 2019 2:33 PM

BJP Will Focus Mainly Five States To Get Into Power - Sakshi

అయిదు రాష్ట్రాలు.. 249 స్థానాలు.. అంటే ఇంచుమించుగా సగం లోక్‌సభ స్థానాలు. ఏ పార్టీ గద్దె ఎక్కాలన్నా, మరే పార్టీ దిగిపోవాలన్నా చక్రం తిప్పే రాష్ట్రాలు ఇవే. లోక్‌సభ స్థానాలు ఎక్కువగా ఉండటం, రాజకీయాలు రోజుకో రంగు మారడం, గెలుపు కోసం పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలు, ఆఖరి నిముషంలో జంప్‌ జిలానీలు.. వీటన్నింటి నడుమ ఓటరు మోదీ మంత్రం జపిస్తాడా? కమనాథులు ఎదుర్కోబోయే కఠిన పరీక్షలేంటి?..

అందరికీ అతి కీలకం..
ఢిల్లీ పీఠం ఎక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో సత్తా చాటాల్సిందే. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఇదే. గత ఎన్నికల్లో ఎవరి ఊహకు అందని విధంగా అమిత్‌ షా రాజకీయ రణతంత్రంతో బీజేపీ సింగిల్‌గానే 71 స్థానాలను సాధించింది.  30 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించిందంటే యూపీలో గెలుపే కారణం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. యోగి ఆదిత్యనాథ్‌ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కానీ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైం ది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న పార్టీలైన అఖిలేశ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాయావతి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేసి విజయం సాధించాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ వారి పొత్తు కమలనాథుల్లో కలవరాన్ని పెంచుతోం ది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలి, అమేధీ స్థానాల్లోనే గెలిచిన ∙కాంగ్రెస్‌ ఈసారి తమ తురుపు ముక్క ప్రియాంకగాంధీని రంగంలోకి దించి తూర్పు యూపీ బాధ్యతల్ని కూడా అప్పగించింది. మరి ఈ మూడు ముక్కలాటలో బీజేపీ ఇతర పార్టీలను ఎంతవరకు కట్టడి చేయగలదో? గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఏకంగా 42.30 శాతం ఓటు షేర్‌ని సాధించింది. ఎస్పీకి  22.20, బీఎస్పీకి 19.60 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు  మోదీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలపడంతో బీజేపీ విజయం నల్లేరు మీద బండి నడకైతే కాదు. 

అనుకూలం
పాక్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో పెరిగిన మోదీ ఇమేజ్‌
వివిధ పార్టీల నుంచి కీలక నేతలు బీజేపీలో చేరడం.

ప్రతికూలం
బలమైన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడం.. ఈ రెండూ కలిస్తే బీజేపీ హవాను అడ్డుకోవచ్చునని గత ఉప ఎన్నికల్లోనే నిరూపితమైంది. 
రాష్ట్ర బీజేపీలో అంతర్గత పోరు

పోయిందనుకున్న పొత్తు.. కుదరింది..
బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రమిది. మిత్రపక్షం శివసేన కూడా అంతకు అంతా బలంగా ఉంది. గత ఎన్నికల్లో మోదీ హవా కూడా తోడవడంతో రెండు పార్టీలు కలిపి 41 స్థానాలు కొల్లగొట్టాయి. ఆపై మిత్రభేదం మొదలైంది. రెండు పార్టీల నేతలు పరస్పరం నిప్పులు చెరిగారు. అయిదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా రామ మందిర నిర్మాణానికి మోదీ సర్కార్‌ చేసినదేమీ లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్య సాక్షిగా నిరసనలూ చేశారు. ఒకానొక దశలో ఈ రెండు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న ఊహాగానాలొచ్చాయి. కానీ శివసేన తన పార్టీ బలబలాలపై సొంతంగా సర్వే చేసింది. ఆ సర్వేలో బీజేపీతో కలిసి నడిస్తేనే లాభం ఉంటుందని తేలింది. ఆ తర్వాతే ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో వీరు తలపడాల్సి ఉంది. మహారాష్ట్ర ఓటర్లు మరోసారి తమను ఆదుకుంటారని కమలనాథులు అంచనాలు వేసుకుంటున్నారు. 

అనుకూలం
మోదీ ఇమేజ్‌
శివసేనతో విభేదాలు సమసిపోయి పొత్తు కుదరడం

ప్రతికూలం
రైతు సమస్యలు, నిరుద్యోగం
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వ వ్యతిరేక సెగ తగిలే అవకాశం

దీదీ.. షా ఢీ..!
గత ఎన్నికల్లో బెంగాల్‌లో మమత దీదీ హవా ముందు ఎవరూ నిలబడలేకపోయారు. 42 స్థానాలతో దేశంలోనే మూడో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకంగా 34 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తే,  బీజేపీ, సీపీఐ(ఎం) చెరో రెండు స్థానాల్లో గెలుపొందాయి. అత్యధిక స్థానాలున్న బెంగాల్‌పై మొదటి నుంచీ అమిత్‌ షా దృష్టి పెట్టారు. తూర్పు రాష్ట్రాల్లో బలపడాలనే విధానంలో భాగంగా బెంగాల్‌ కోటలో పాగా వేసేలా  క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరిగేలా వ్యూహాలు రచించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రం కావడంతో సరిహద్దు జిల్లాల్లో బెంగాల్‌ నుంచి హిందువు ఎక్కువ. పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజిస్టర్‌ వంటి అంశాలను ప్రస్తావిస్తే ఈ జిల్లాల్లో తమకు కలిసివస్తుందని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది.

దీదీని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్న భావనైతే అందరిలోనూ నెలకొంది.. తృణమూల్‌ నుంచి వచ్చిన ముకుల్‌ రాయ్‌ వంటి నేతలు బీజేపి బలం పెరగడానికి దోహదపడుతున్నారు. తృణమూల్‌లో కీలక నేతలైన ఎమ్మెల్యే అర్జున్‌ సింగ్‌ వంటివారు కమలం గూటికి చేరుకోవడంతో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీదీ వామపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసే చర్యలే బీజేపీకి ఆ రాష్ట్రంలో అనుకూలంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. అందుకే దీదీ కూడా రూటు మార్చి కమ్యూనిస్టుల విషయంలో కాస్త మెత్తబడ్డారు. ప్రధాని కావాలన్న తన కలలు సాకారం చేసుకోవడానికి పట్టు విడుపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దీదీ వర్సస్‌ మోదీగా మారిపోయిన ఈ ఎన్నికల్లో కమలనాథులు ఎంతరవకు పై చేయి సాధిస్తారో మరి.

అనుకూలం
అమిత్‌ షా ప్రత్యేకంగా పెట్టిన దృష్టితో క్షేత్రస్థాయిలో బలపడడం
తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు బీజేపీ గూటికి చేరడం

ప్రతికూలం
మమతాబెనర్జీ వంటి గట్టి నాయకురాలిని ఎదుర్కోవడం
సీపీఐ(ఎం)పై మమత సానుకూల బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం

దిగ్గజ నేతలు లేని తమిళం..
దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైనది తమిళనాడే. ఇక్కడ జాతీయ పార్టీల కు పెద్దగా చోటు లేదు. వాళ్లు ఒంటరిగా పోటీచేసే పరిస్థితులూ లేవు. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలే 1967 నుంచి ఈ రాష్ట్రా న్ని శాసిస్తున్నాయి. సంక్షేమానికి మారుపేరైన జయలలిత, ద్రవిడ సిద్ధాంతాలకు గట్టి పునాదులేసిన కరుణానిధి వంటి రాజకీయ దిగ్గజాల కన్నుమూత తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. కమలహాసన్‌ పొలిటికల్‌ స్టార్‌గా మారి మక్కల్‌ వీధి నయ్యం పేరుతో పార్టీ పెట్టి తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో జయలలిత ప్రాభవం ముందు ఏ పార్టీ నిలవలేదు. చివరికి డీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. మోదీ హవాను క్యాష్‌ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నించినా  లేడీ వర్సెస్‌ మోదీ అంటూ చేసిన ప్రచారం తో అన్నాడీఎంకే ఏకంగా 37 స్థానా ల్లో జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు పళనిస్వామి నేతృత్వం లోని అన్నాడీఎంకేతో బీజేపీ జత కట్టింది. కానీ ఈ రెండు పార్టీలు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నా యి. మరోవైపు డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి బలంగా ఉంది. 

అనుకూలం
మోదీకున్న ఇమేజ్‌

ప్రతికూలం
క్షేత్రస్థాయిలో పట్టులేకపోవడం, 5 స్థానాల్లోనే పోటీకి దిగడం
అధికార అన్నాడీఎంకేతో పొత్తు వల్ల ప్రభుత్వ వ్యతిరేక సెగ.. పళనిస్వామి

పాతమిత్రులందరూ..ఒక్కటయ్యారు..
2014 బిహార్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో చేతులు కలిపినా ఇంచుమించుగా ఒంటరి పోరాటమే చేసింది. విభేదాల కారణంగా చిరకాల మిత్రుడు నితీశ్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌)తో ఎన్నికలకు ముందే తెగదెంపులు చేసుకోవడం కమలనాథులకు కలిసి వచ్చింది. కానీ ఈ అయిదేళ్లలో పరిస్థితులు మారాయి. పాత మిత్రులందరూ మళ్లీ చేతులు కలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ, నితీష్‌ కుమార్‌ జేడీ (యూ), రామ్‌విలాస్‌ పాశ్వానే నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈసారి 17 స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీకి దిగుతోంది. అయితే లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆర్‌జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాగఠ్‌ బంధన్‌ నుంచి గట్టి పోటీయే ఉంది. అందుకే కుల సమీకరణలు, కేంద్రం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలనే నమ్ముకొని బీజేపీ ప్రచారం చేస్తోంది. 

అనుకూలం
బీజేపీ, జేడీ(యూ) కలిసి పోటీ చేస్తూ ఉండడంతో కుల సమీకరణలు 
లాలూకి శిక్షపడి ఆస్పత్రిలో ఉండడంతో ప్రచారానికి దూరంగా ఉండడం

ప్రతికూలం
విపక్ష పార్టీలన్నీ చేతులు కలపడం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement