అమేథీలో మహిళా కార్మికుల భేటీలో పాల్గొన్న రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ: బీజేపీ ఓటమి పాలు కావడం ఖాయమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చెప్పారు. నాలుగు దశల పోలింగ్ సరళిని చూశాక బీజేపీ అధికారం కోల్పోయేలా ఉందని, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేని ప్రధాని ముఖంలో భయం కనిపిస్తోందన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూస్తుందని తమ పార్టీ అంతర్గత విశ్లేషణలో వెల్లడైందని చెప్పారు. ‘పైకి తెలియని ప్రభావంతో బీజేపీ ఓడిపోనుంది. వారి ప్రచారం భయంభయంగా సాగింది. ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేని మోదీ ముఖంలో భయం కనిపించింది’ అని అన్నారు.
ఆయనకు మీరైనా చెప్పండి..!
ప్రధానిగా మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడంపై ఆయన మాట్లాడుతూ..‘కనీసం రెండు ప్రెస్‌మీట్లైనా పెట్టకపోవడం మంచిది కాదని మోదీకి మీరైనా చెప్పండి’ అని మీడియాను కోరారు. అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడే ప్రధానికి దేశీయ మీడియా ఎదుర్కొనేంత సాహసం లేదని ఎద్దేవా చేశారు. భారత సైన్యం ప్రధాని మోదీ సొంత ఆస్తి కాదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. సైన్యం, నావికా వైమానిక దళాలను వ్యక్తిగత ఆస్తి అనుకుంటున్నారని ప్రధానిపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment