న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మతపరమైన విద్వేషాలు సృష్టించేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని విపక్షాలు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు పాకిస్తాన్ మద్దతుదారులని విమర్శించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో వివక్ష ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో పౌరసత్వం కల్పిస్తున్నామన్నారు. ఈ మూడు దేశాల్లో ముస్లింలు వివక్ష ఎదుర్కోవడం లేదని, ఈ దేశాల్లో ముస్లిమేతరులే మైనారిటీలుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న చొరబాటుదారులను, శరణార్థులను వేరు వేరుగా చూస్తున్నామని, 30-40 సంవత్సరాల క్రితం శరణార్థులుగా వచ్చినవారికే పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగే భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం జరగదని ఆయన వివరించారు.
బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలో పౌరసత్వంకు సంబంధించిన అంశం ఉందని, ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ చట్టం కార్యరూపం దాల్చలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కాగా, శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన తమిళులకు గతంలోనే పౌరసత్వం ఇచ్చామని, ఒకవేళ శ్రీలంక ప్రభుత్వం కోరితే శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మతపరంగా చూడొద్దని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దెందుకు రాష్ట్రాలు కోరితే కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. (చదవండి : కేంద్రానికి షాకిచ్చిన నితీష్ కుమార్)
Comments
Please login to add a commentAdd a comment