రేవేంద్రపాడులో ప్రసంగిస్తున్న లోకేష్
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లిరూరల్ (మంగళగిరి) : ఎన్నికల ప్రచారం పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న కామెడీ షో అప్రతిహతంగా కొనసాగిపోతోంది. ఇటీవల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త విని పరవశించి పోయా అని వ్యాఖ్యానించి అభాసుపాలైన లోకేశ్.. రెండు రోజుల కిందట తాడేపల్లి మండలం మధురానగర్‌లో మాట్లాడుతూ ‘‘ మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏప్రిల్ 9న (ఏప్రిల్ 11న) జరిగే పోలింగ్‌లో నాకు ఓటు వేసి ఆశీర్వదించండి’’ అని మాట తూలి తన అజ్ఞానాన్ని మరోమారు ప్రదర్శించుకున్నాడు. తాజాగా ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం, పేరికలపూడిలో నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ ‘‘మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న ఓటర్లంతా అవాక్కయ్యారు. అసలు సముద్రమే లేని రాష్ట్రానికి పోర్టు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు.? అని నవ్వుకున్నారు. ఇలాంటి కామెడీ పీస్‌కి ఎలా ఓటేయాలని మంగళగిరి ఓటర్లు చర్చించుకోవడం గమనార్హం.
రైతులకు పసుపు కుంకుమ!!
ఆదివారం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ముఖద్వారం వద్ద లోకేష్ మాట్లాడుతూ ‘అక్కల్లారా, చెల్లెల్లారా పసుపు కుంకుమ నగదు పడినియ్యా’ అని అడిగారు. అయితే అక్కడ ఉన్నదంతా రైతులే కావడంతో లోకేష్ మాటలకు వారు నవ్వుకున్నారు. అక్కడ నుంచి రేవేంద్రపాడు గ్రామంలోకి వచ్చిన లోకేష్ అక్కడ అందరూ మహిళలు ఉంటే వారికి రైతు రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. అనంతరం కాసేపు స్థానిక సమస్యలపై ముక్తసరిగా మాట్లాడిన లోకేష్ షెడ్యూల్‌లోని మిగతా గ్రామాలకు వెళ్లకుండానే ప్రచారాన్ని ఆపి వెనుదిరిగారు.
లోకేశ్ షోపై సోషల్ మీడియాలో సెటైర్లు..
లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. మచిలీపట్నం పోర్టును తెలంగాణ రాష్ట్రానికి తీసుకువెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్న వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తెలంగాణలో సముద్రం లేనప్పుడు మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఎలా తీసుకువెళ్తారంటూ సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. లోకేశ్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలు మంగళగిరి వాసులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ పెద్దఎత్తున కామెడీ పంచుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment