తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బతగిలింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీనీ వీడేందుకు కొంతమంది నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ రాష్ట్రంలో మనుగడ కొనసాగించడం కష్టమవుతుండటంతో తామే ముందు జాగ్రత్త పడితే మంచిదని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇప్పుడే పార్టీ మారి కొత్తపార్టీలో ఈ ఐదేళ్లు పనిచేస్తే తగిన గుర్తింపు వస్తుందని తమ అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, విజయవాడ: జిల్లా టీడీపీ గడ్డు పరిస్థితిని అనుభవిస్తోంది. ఒక పక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు.. మరో పక్క పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారే.. విజయవాడ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక నాయకుడు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతానికి ఈయన విదేశాల్లో ఉన్నారు. స్వదేశం వచ్చిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ తనకు తగిన గుర్తింపు రాలేదని, అందువల్లే మరొక uమొదటిపేజీ తరువాయి పార్టీలోకి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే ఇటీవల ‘ట్వీటారు’ కూడా. కాగా మరో యువనేత కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితులతో ఈ విషయం పై చర్చించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో తనకు నగరంలో కాకుండా మరో నియోజకవర్గంలో చంద్రబాబు సీటు కేటాయించి అన్యాయం చేశారనే ఆగ్రహంతో ఉన్నట్లు వినికిడి. టీడీపీలో పడ్డ కష్టం మరొక పార్టీలో పడితే తనకు తప్పకుండా మంచి గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు. నగరంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక నియోజకవర్గం పై ఈ ఇద్దరు నేతలు కన్నేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు నగరంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాగా వీరిద్దరి బాటలోనే జిల్లాలోని నూజీవీడుతో పాటు మరొక నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గాలం వేస్తున్న సుజనా చౌదరి
ఇటీవల టీడీపీనీ బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి కృష్ణాజిల్లాలోని టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు. తన సొంత జిల్లా కావడంతో కొంతమందిని బీజేపీలోకి చేర్చడం ద్వారా బీజేపీ నాయకులకు తన సత్తా చూపించాలని భావిస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో ఆయన వ్యక్తిగతంగా టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా తమ సామాజికవర్గం వారిని బీజేపీలోకి తీసుకుని తద్వారా బీజేపీని బలోపేతం చేయాలని సుజనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బుజ్జగిస్తున్న ఓ మాజీ మంత్రి..
కాగా గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన జిల్లాకు చెందిన ఒక మంత్రి టీడీపీకి గండిపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ వీడవద్దని తెలుగు తమ్ముళ్లకు సర్ది చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో గుర్తింపు ఇస్తామని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ ఎదగదని, ఆ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసుకోవద్దంటూ హితవు పలుకుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment