కోడెల ఫ్యామిలీ (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి : ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా కోడెల అరాచకాలపై ధ్వజమెత్తారు. కోడెల కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని, నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
చదవండి: కోడెల కుమార్తెపై కేసు
పవిత్ర గ్రంథంలా భావిస్తున్నారు..
ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో 99 శాతం సాధ్యంకానీ హామీలను గుప్పిస్తాయని మరో ట్వీట్‌లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వారు గెలిచాక మేనిఫెస్టోనే మాయం చేయడం చూశామని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం దాన్నో పవిత్ర గ్రంథంలా భావిస్తున్నారని తెలిపారు. నవరత్నాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
ఇప్పటికే ‘మా ఎన్నికల మేనిఫెస్టో మాకు ఓ బైబిల్.. ఓ ఖురాన్.. ఓ భగవద్గీత..’ అని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామనేది మాటల్లో కాకుండా.. ఆయన చేతల్లో కూడా చూపించారు. సచివాలయంలో తాను కూర్చునే అధికారిక ఛాంబర్‌కు వచ్చి పోయే దారిలో ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేములుగా కట్టించి గోడలకు ఆకర్షణీయంగా అలంకరింపజేశారు. అంతే కాదు, తన ఛాంబర్ లోపల ఎన్నికల మేనిఫెస్టో ప్రతికి సంబంధించిన పెద్ద బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు తానిచ్చిన వాగ్దానాలు, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన పనులు తనకు గుర్తుండేలా, ఎప్పుడూ తనను హెచ్చరిస్తూ ఉండేలా జగన్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. (చదవండి: కళ్లెదుటే మేనిఫెస్టో)
Comments
Please login to add a commentAdd a comment