చెన్నై: కీలకదశలో సుమంత్, అశ్విన్ హెబ్బర్ అర్ధ సెంచరీలు చేయడంతో... తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు 55 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 93 ఓవర్లలో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది.
తమిళనాడు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజున ఒకదశలో ఆంధ్ర జట్టు 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సుమంత్ (72 బ్యాటింగ్; 4 ఫోర్లు), అశ్విన్ (64; 8 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుతంగా ఆడి ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
అంతకుముందు ప్రశాంత్ (1), కెప్టెన్ హనుమ విహారి (3), వేణుగోపాల్‌రావు (3) తక్కువ స్కోర్లకే అవుటవ్వగా... శ్రీకర్ భరత్ (32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ప్రస్తుతం సుమంత్‌తో కలిసి షోయబ్ ఖాన్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో అశ్విన్, ఎల్. విఘ్నేశ్, కె.విఘ్నేశ్ రెండేసి వికెట్లు తీశారు. మరోవైపు హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌లో రెండోరోజు ఆట కూడా సాధ్యపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment