ధోని దూకుడు...
రహానే అర్ధ సెంచరీ ∙ భారత్ 251/4 ∙వెస్టిండీస్‌తో మూడో వన్డే
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): ఎంఎస్ ధోని (79 బంతుల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్‌కు తోడు ఓపెనర్ అజింక్యా రహానే (112 బంతుల్లో 72; 4 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫామ్‌ను చాటుకున్నాడు. మరోవైపు కరీబియన్ పర్యటనలో తొలిసారిగా భారత మిడిలార్డర్ కూడా పూర్తి స్థాయిలో తమ బ్యాట్‌లకు పనిచెప్పింది.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న యువరాజ్ (55 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఆత్మవిశ్వాసం కనబర్చగా... చివర్లో కేదార్ జాదవ్ (26 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. దీంతో శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 251 పరుగులు చేసింది. అయితే ముందు రోజు రాత్రి భారీ వర్షం కురవడంతో ఆట 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
ఆరంభంలోనే రెండు వికెట్లు
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ముందుగానే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. చాంపియన్స్ ట్రోఫీ నుంచి విశేషంగా రాణిస్తున్న ఓపెనర్ ధావన్ వరుసగా ఏడు మ్యాచ్‌ల అనంతరం తొలిసారిగా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యాడు. మూడో ఓవర్‌లోనే అతను థర్డ్ మ్యాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. రహానే మాత్రం తన సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే పదో ఓవర్‌లోనే విండీస్ మరో షాక్ ఇచ్చింది.
హోల్డర్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లి (22 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను కైల్ హోప్ ఎడమవైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా పట్టుకోవడంతో 34 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పేలవ ఫామ్‌తో ఒత్తిడిలో ఉన్న యువరాజ్ చక్కటి ఆటతీరుతో రహానేకు తోడ్పాటునందించాడు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న అతను ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడాడు. చక్కటి ఫోర్లతో క్రీజులో కుదురుకుంటున్న దశలో బిషూ బౌలింగ్‌లో థర్డ్ అంపైర్ రివ్యూతో ఎల్బీగా వెనుదిరిగాడు.
మూడో వికెట్‌కు వీరి మధ్య 66 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రహానే, ధోని జోడి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో ముగిసింది. మరోవైపు పరుగులు తీసేందుకు తీవ్రంగా శ్రమించిన భారత్ అప్పటికి నాలుగు వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 66 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ధోని ఒక్కసారిగా «చెలరేగి హోల్డర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అటు జాదవ్ కూడా అదే రీతిన ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో జట్టు 56 పరుగులు సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బిషూ (బి) కమిన్స్ 72; ధావన్ (సి) చేజ్ (బి) కమిన్స్ 2; కోహ్లి (సి) కైల్ హోప్ (బి) హోల్డర్ 11; యువరాజ్ ఎల్బీడబ్లు్య (బి) బిషూ 39; ధోని నాటౌట్ 78; జాదవ్ నాటౌట్ 40; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–11, 2–34, 3–100, 4–170. బౌలింగ్: కమిన్స్ 10–0–56–2; హోల్డర్ 10–1–53–1; విలియమ్స్ 10–0–69–0; నర్స్ 10–0–34–0; బిషూ 10–0–38–1.
నాలుగో స్థానానికి ధోని...
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 294 మ్యాచ్‌లలో ధోని 9,442 పరుగులు చేశాడు. 9,378 పరుగులు చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను అతను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), గంగూలీ (11,363), ద్రవిడ్ (10,889) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.