రికియార్డో తొలిసారి... | first time rikiyord | Sakshi
Sakshi News home page

రికియార్డో తొలిసారి...

Published Tue, Jun 10 2014 12:51 AM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM

రికియార్డో తొలిసారి... - Sakshi

రికియార్డో తొలిసారి...

కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
- మెర్సిడెస్ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు
- హామిల్టన్‌కు నిరాశ
- ‘ఫోర్స్’ హుల్కెన్‌బర్గ్‌కు ఐదో స్థానం
- ఎనిమిది మంది మధ్యలోనే అవుట్
మాంట్రియెల్ (కెనడా): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తొలి ఆరు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కెనడా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్లను వెనక్కినెట్టి రెడ్‌బుల్ జట్టు యువ డ్రైవర్ డానియెల్ రికియార్డో విజేతగా అవతరించాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు. అయితే రేసు సమయంలో రికియార్డో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఇంధనాన్ని వాడినట్లు తేలడంతో అతనిపై అనర్హత వేటు వేశారు. కెరీర్‌లోని తొలి రేసులోనే చేదు అనుభవాన్ని చవిచూసిన రికియార్డో నిరాశను పక్కనబెట్టాడు. కెనడా గ్రాండ్‌ప్రిలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అనుకున్న ఫలితాన్ని సాధించాడు. తన కెరీర్‌లో తొలి విజయాన్ని నమోదు చేయడంతోపాటు ఈ సీజన్‌లో రెడ్‌బుల్ జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసు ఆద్యంతం నాటకీయంగా సాగింది. 70 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో గంటా 39 నిమిషాల 12.830 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగు సెకన్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో ఏకంగా ఎనిమిది మంది డ్రైవర్లు వివిధ కారణాలతో రేసు మధ్యలోనే వైదొలిగారు.

మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో రేసును మొదలుపెట్టినా ఇంజిన్‌లో సమస్య కారణంగా 46వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. హామిల్టన్‌తోపాటు మరో ఏడుగురు డ్రైవర్లు గ్రోస్యెన్ (లోటస్), క్వియాట్ (ఎస్టీఆర్), కొబయాషి (కాటర్‌హమ్), మల్డొనాడో (లోటస్), ఎరిక్సన్ (కాటర్‌హమ్), మాక్స్ చిల్టన్ (మారుసియా), బియాంచి (మారుసియా) కూడా రేసును పూర్తి చేయలేకపోయారు.

భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి తన ఖాతాలో 10 పాయింట్లు వేసుకోగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో నిలిచి త్రుటిలో పాయింట్‌ను కోల్పోయాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఈ నెల 22న జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement