గెలిస్తే గొప్ప ఘనతవుతుంది! | India strongest XI for the Sydney Test | Sakshi
Sakshi News home page

గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!

Published Thu, Jan 3 2019 12:47 AM | Last Updated on Thu, Jan 3 2019 12:47 AM

India strongest XI for the Sydney Test - Sakshi

సిడ్నీ: నాలుగేళ్ల క్రితం ధోని అనూహ్య రిటైర్మెంట్‌తో సిడ్నీలో జరిగిన చివరి టెస్టుతోనే కోహ్లి కెప్టెన్‌గా బాధ్యత చేపట్టాడు. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్‌ కోహ్లి నాయకత్వంలో వరుస విజయాలు సాధించి నంబర్‌వన్‌గా ఎదిగింది. ఇప్పుడు ‘టాప్‌’ హోదాలో మరోసారి అదే మైదానానికి వచ్చిన కోహ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ గెలవడం ఎంతో కష్టమని, ఇప్పుడు గనక దానిని సాధిస్తే అది చాలా పెద్ద ఘనత అవుతుందని వ్యాఖ్యానించాడు. ‘నేను వరుసగా మూడో సారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాను. ఇక్కడ సిరీస్‌ గెలుపు ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నా నాయకత్వంలో ఇక్కడి నుంచి భారత జట్టు కొత్త ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు నంబర్‌వన్‌గా మళ్లీ వచ్చాం. దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. అందుకే సిరీస్‌ గెలిస్తే దానిని నేను మాత్రమే కాకుండా జట్టంతా గొప్ప ఘనతగా భావిస్తుంది’ అని కోహ్లి అన్నాడు. తన దృష్టిలో గత రికార్డులకు ఎలాంటి విలువ లేదని, తాను చరిత్రను పట్టించుకోనని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో ఎప్పుడైనా గెలవాలనే కసి ఉండాలన్నాడు. ‘మనకు ఏదైనా లక్ష్యం మాత్రమే ఉంటే ఒకటి రెండు మ్యాచ్‌ల తర్వాత అది ముగిసిపోతుంది. కానీ ఎప్పుడైనా గెలవాలనే కసి ఉంటే మాత్రం అది ఆగిపోదు. మెల్‌బోర్న్‌ టెస్టులో గెలిచిన క్షణాన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారితో సహా ప్రతీ ఒక్కరు తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. అందరిలోనూ ఒక రకమైన కసి అక్కడ కనిపించింది. నిజాయతీగా చెప్పాలంటే గతంలో ఏం జరిగిందనేది అనవసరం. నేను వర్తమానంపైనే దృష్టి పెట్టి పని చేస్తా’ అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయంతో తాను ఏదో నిరూపించుకోవాలని భావించడం లేదన్న భారత కెప్టెన్‌... కొత్త సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.  

అశ్విన్‌ గాయం కొత్తది కాదు! 
వరుసగా రెండు విదేశీ పర్యటనల్లోనూ ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ ఒకే తరహా గాయంతో బాధపడుతున్నాడని, దీనికి పరిష్కారం చూడాల్సి ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘ఇంగ్లండ్‌లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అశ్విన్‌కు ఒకే తరహా గాయం ఉండటం దురదృష్టకరం. దీనికి చికిత్స తీసుకోవడంపై అతను దృష్టి పెట్టాడు. ఫిజియో, ట్రైనర్‌ కూడా అందుకు సహకరిస్తున్నారు. టెస్టు క్రికెట్‌లో అతను ఎంత కీలకమో తెలుసు కాబట్టి 100 శాతం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. సరైన సమయంలో కోలుకోలేకపోతున్నందుకు  అశ్విన్‌ కూడా బాధపడుతున్నాడు’ అని కోహ్లి చెప్పాడు. మరోవైపు ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి బౌలింగ్‌పై కెప్టెన్‌ ప్రశంసలు కురిపించాడు. నిజానికి అశ్విన్‌ గైర్హాజరులో ఆఫ్‌ స్పిన్‌ లోటు కనిపించడం లేదని, విహారి పార్ట్‌టైమర్‌గానే ఆ పని చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. అతనికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ తమకు మంచి ప్రత్యామ్నాయంగా మారాడని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement