బెంగళూరు: ఐపీఎల్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడును మరోసారి భారత జట్టు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే జట్టులోకి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత అతను టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం. కేదార్ జాదవ్ గాయపడటం, మనీశ్ పాండే వరుస వైఫల్యాలతో మిడిలార్డర్‌లో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్ అవసరం జట్టుకు కలిగింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన ఆటగాడిగా రాయుడును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గుర్తించింది. 2017–18 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాయుడు 5 మ్యాచ్‌లలో (నిషేధం కారణంగా 2 మ్యాచ్‌లు ఆడలేదు) 43.20 సగటుతో 216 పరుగులు చేశాడు. తాజాగా ఐపీఎల్‌లో అతని ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించింది. ఇప్పటివరకు చెన్నై తరఫున 10 మ్యాచ్‌లలో 151.61 స్ట్రైక్‌రేట్‌తో 423 పరుగులు చేసిన రాయుడు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా రాయుడుకు టి20 టీమ్‌లో మాత్రం స్థానం లభించలేదు. గత ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన లోకేశ్ రాహుల్‌కు మళ్లీ అవకాశం లభించింది. రాహుల్ భారత్ తరఫున ఇప్పటి వరకు 10 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు టెస్టు జట్టులో రెగ్యులర్‌గా ఉన్న ఉమేశ్ యాదవ్‌కు తాజాగా వన్డే, టి20 జట్లలో కూడా స్థానం లభించింది. ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చడం అతనికి అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తన ఆఖరి వన్డే ఆడిన ఉమేశ్... టి20ల్లో ఒకే ఒక మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే టి20 జట్టులో ఉన్న సుందర్‌కు వన్డేల్లో మరోసారి పిలుపొచ్చింది.
ఆ ఇద్దరు...
కొద్ది రోజుల క్రితం వరకు కూడా భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో అజింక్య రహానే, మనీశ్ పాండేలు ఖాయంగా ఉన్నారు. నాలుగో స్థానంలో వీరిలో ఎవరో ఒకరు ఆడవచ్చని కోహ్లి మాటల్లో కూడా చాలా సార్లు వినిపించింది. కానీ వీరిద్దరిపై అప్పుడే సెలక్టర్లు నమ్మకం కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకపై అర్ధసెంచరీ తర్వాత 7 ఇన్నింగ్స్‌లలో పాండే ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆశ్చర్యకరంగా రహానేపై కూడా వేటు పడింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా... అంతకు ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. పేసర్ షమీకి కూడా వన్డే టీమ్‌లో చోటు పోయింది. ధోని రాకతో టి20ల్లో రిషభ్ పంత్ స్థానం కోల్పోగా... అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు దూరమయ్యారు. షమీకి వన్డేల్లో చోటు పోగా, ఉనాద్కట్‌ను టి20ల నుంచి తప్పించారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటుతున్న పేసర్ సిద్ధార్థ్ కౌల్‌కు వన్డే, టి20 జట్లలో చోటు లభించడం విశేషం. కొన్నాళ్ల క్రితం శ్రీలంకతో సిరీస్‌కు అతను ఎంపికైనా, ఆడే అవకాశం రాలేదు.
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, అయ్యర్, రాయుడు, ధోని, దినేశ్ కార్తీక్, చహల్, కుల్దీప్, సుందర్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కౌల్, ఉమేశ్.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టి20లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, రైనా, పాండే, ధోని, కార్తీక్, చహల్, కుల్దీప్, సుందర్, భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, కౌల్, ఉమేశ్.
రాయుడొచ్చాడు...
Published Wed, May 9 2018 1:21 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment