రైజర్స్‌కు ‘సొంత’ దెబ్బ
- ముంబైని గెలిపించిన రాయుడు
- మెరిసిన సిమ్మన్స్
- ఫించ్, వార్నర్‌ల శ్రమ వృథా
- సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్
ప్లే ఆఫ్ ఆశలతో సొంతగడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన సన్‌రైజర్స్‌కు... హైదరాబాద్‌లోని తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ జట్టులోని హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు సొంతగడ్డపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రైజర్స్‌ను దె బ్బతీశాడు. సిమ్మన్స్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడటంతో ఈ సీజన్‌లో ఉప్పల్‌లో తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
సాక్షి, హైదరాబాద్: తెలుగు తేజం అంబటి రాయుడు (46 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్‌లు) చేతిలో హైదరాబాద్ జట్టు ఓడింది. సోమవారం ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌ను ఒక్కమాటలో ఇలాగే చెప్పాలి. సొంత మైదానంలో, సొంత ప్రేక్షకుల మధ్య రాష్ట్రానికి చెందిన ఆటగాడు ప్రత్యర్థి జట్టును గెలిపించడం వింతగా అనిపించినా అదే జరిగింది. రాయుడుతో పాటు సిమ్మన్స్ (50 బంతుల్లో 68; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) కూడా రాణించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫించ్ (62 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్) మాత్రమే రాణించారు. మలింగకు రెండు వికెట్లు దక్కాయి. భువనేశ్వర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాయుడుకు దక్కింది.
రాణించిన ఫించ్
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓ మోస్తరు శుభారంభం దక్కింది. మూడో ఓవర్‌లో ఫించ్ రెండు ఫోర్లు బాది 13 పరుగులు సాధించాడు. అయితే మలింగ తన తొలి ఓవర్‌లో కెప్టెన్ ధావన్ (11 బంతుల్లో 11; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. ఓజా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఫించ్ 6, 4 బాదడంతో పవర్ ప్లేలో 43 పరుగులు వచ్చాయి.
అటు ఫించ్ తన జోరును ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ స్థానంలో బరిలోకి దిగిన ఓజాను లక్ష్యం చేసుకుని పరుగులు బాగానే పిండుకున్నాడు. ఈ సమయంలో లేని పరుగు కోసం యత్నించి లోకేశ్ రాహుల్ (13 బంతుల్లో 10; 1 ఫోర్) రనౌట్ అయ్యాడు. కవర్‌లో బంతిని పుష్ చేసిన తను పరుగు కోసం వెళ్లాడు. అయితే రోహిత్ వేగంగా స్పందించడంతో రనౌట్ అయ్యాడు. రెండో వికెట్‌కు 39 పరుగులు వచ్చాయి.
ఈ దశలో ఫించ్‌కు వార్నర్ జత కలిశాడు. ఫించ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కూడా బ్యాట్‌ను ఝళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ దశలో మలింగ్ బౌలింగ్‌లో ఫించ్ లాంగ్ ఆఫ్‌లో భారీ సిక్స్‌కు యత్నించి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌లో నమన్ ఓజా (3 బంతుల్లో 7 నాటౌట్; 1 సిక్స్) ఓ సిక్స్‌తో పాటు వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ 33 పరుగులు సాధించింది.
సిమ్మన్స్, రాయుడు జోరు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత రీతిలో అడ్డుకున్నారు. తొలి ఓవర్‌లో కేవలం రెండు పరుగులే రాగా రెండో ఓవర్‌లో ఓపెనర్ గౌతమ్ (1)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్, అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇర్ఫాన్ తొలి ఓవర్‌లో సిమ్మన్స్ 6, 4, 6 తో విరుచుకుపడ్డాడు. ఇదే ఊపును కొనసాగిస్తూ కరణ్ శర్మ బౌలింగ్‌లోనూ 4, 6తో రెచ్చిపోగా.... రాయుడు పఠాన్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో ఆడుకున్నాడు.
ఆ తర్వాత కూడా హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో వీరు యథేచ్ఛగా ఆడారు. 39 బంతుల్లో సిమ్మన్స్ అర్ధ సెంచరీ చేసుకోగా.. రాయుడు 34 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని భువనేశ్వర్ విడదీశాడు. ర్యాంప్ షాట్‌కు యత్నించిన సిమ్మన్స్ భువీ యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రాయుడు, సిమ్మన్స్ రెండో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ మరుసటి ఓవర్‌లోనే రాయుడు... హెన్రిక్స్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికే మ్యాచ్‌లో పైచేయి సాధించిన ముంబై ఒత్తిడికి లోను కాకుండా రోహిత్ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు), పొలార్డ్ (7 బంతుల్లో 6 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పొలార్డ్ (బి) మలింగ 68; ధావన్ (బి) మలింగ 11; రాహుల్ (రనౌట్) 10; వార్నర్ నాటౌట్ 55; నమన్ ఓజా నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 5) 6; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లు) 157.
వికెట్ల పతనం: 1-31; 2-70; 3-133.
బౌలింగ్: అండర్సన్ 2-0-17-0; బుమ్రా 4-0-24-0; హర్భజన్ 4-0-27-0; మలింగ 4-0-35-2; ఓజా 4-0-32-0; పొలార్డ్ 2-0-21-0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) భువనేశ్వర్ 68; గౌతమ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 1; రాయుడు (సి అండ్ బి)
హెన్రిక్స్ 68; రోహిత్ నాటౌట్ 14; పొలార్డ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 3) 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు)160.
వికెట్ల పతనం: 1-2; 2-132; 3-141;
బౌలింగ్: స్టెయిన్ 4-0-29-0; భువనేశ్వర్ 4-0-21-2; ఇర్ఫాన్ 2-0-29-0; మిశ్రా 3-0-33-0; శర్మ 2.4-0-25-0; హెన్రిక్స్ 3-0-23-1.