ఆమ్‌స్టెల్వీన్: ఇటీవల వన్డేల్లో అరంగేట్రం చేసిన నేపాల్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. శుక్రవారం నెదర్లాండ్స్‌తో ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో వన్డేలో నేపాల్ పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి నెదర్లాండ్స్ చివరి వికెట్‌ను సాధించి మరీ నేపాల్ గెలుపును సొంతం చేసుకుంది. ఇది వన్డేల్లో నేపాల్‌కు తొలి గెలుపు.
నెదర్లాండ్స్‌తో రెండు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.5 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసినప్పటికీ, చివరకు పరాజయం తప్పలేదు.ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నెదర్లాండ్స్ రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. కాగా, నెదర్లాండ్ ఆటగాడు ఫ్రెడ్ క్లాసెన్ రనౌట్ అయ్యాడు. దాంతో నేపాల్‌కు మొదటి వన్డే విజయం దక్కింది. అదే సమయంలో ఈ సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలి వన్డేలో నెదర్లాండ్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment